UAE: పాపం.. భారత ప్రవాసుడు.. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకున్నాడు.. కానీ, ఊహించని విధంగా..
ABN , First Publish Date - 2023-04-24T09:25:04+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) విషాద ఘటన చోటు చేసుకుంది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) విషాద ఘటన చోటు చేసుకుంది. మరో నెల రోజుల్లో 36వ బర్త్‌డే జరపుకోవాల్సిన భారత ప్రవాసుడు (Indian Expat) ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రంజాన్ సందర్భంగా షాపింగ్ కోసం ముస్సాఫాకు (Mussafah) వెళ్లిన సమయంలో గురువారం (ఏప్రిల్ 20న) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలు వాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు (Palakkad District) చెందిన సుబీష్ చోజియంపరంబత్‌గా (Subeesh Chozhiyamparambath) గుర్తించారు. ఈ ప్రమాదంలో సుబీష్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో (ICU) చికిత్స అందిస్తున్నారు. మరోకరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
సుబీష్ గత రెండేళ్ల నుంచి యూఏఈలో ఉంటున్నాడు. మరో నెల రోజుల్లో అతడి పుట్టినరోజు ఉంది. ఇంతలోనే ఈ విషాదం జరిగింది. ఏప్రిల్ 20న సాయంత్రం అతడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రంజాన్ షాపింగ్ కోసం కారులో ముస్సాఫాకు వెళ్లాడు. అక్కడ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో అల్ మఫ్రాక్ ప్రాంతంలో (Al Mafraq area) పలు వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుబీష్ ప్రయాణిస్తున్న కారును మరో వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన భారత ప్రవాసుడు అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరోకరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక సుబీష్ ఇటీవల స్నేహితులతో ఈ ఏడాది పెళ్లి చేసుకుని కొన్ని రోజులు స్వదేశంలో గడిపిన తర్వాత తిరిగి వస్తానని చెబుతుండేవాడట. కానీ, తాను ఒకటి తలిస్తే విధి మరోకటి తలిచింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. అక్కడి పేపర్ వర్క్‌ను త్వరగా పూర్తి చేసి సుబీష్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించడంలో భారత రాయబార కార్యాలయం సహాయం చేసినట్లు అతడి మిత్రుడు తెలిపాడు.