Indian Origin: 9ఏళ్ల క్రితం కారు కోసం లోన్ తీసుకుని దేశం దాటిన ఎన్నారై.. బంధువు చనిపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.. ఆ తర్వాత జరిగింది ఇదీ..!
ABN , First Publish Date - 2023-04-16T19:02:30+05:30 IST
కారు లోన్ తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించి దేశం దాటాడు.
ఎన్నారై డెస్క్: కారు లోన్ తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించి దేశం దాటాడు. చివరికి స్వదేశానికి వచ్చి పోలీసులకు చిక్కాడు. దాంతో బ్యాంకులను మోసం చేసినందుకు గాను న్యూజిలాండ్‌లో (New Zealand ) స్థిరపడిన భారత సంతతికి చెందిన ఉపాధ్యాయుడిని ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఆర్ధిక నేరాల విభాగం (Economic Offences Wing) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనిల్ మారుతీ గైక్వాడ్ (Anil Maruti Gaikwad) అనే టీచర్ నకిలీ పత్రాలతో జైపూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ (State Bank of Bikaner) నుంచి కారు కోసం లోన్ తీసుకున్నాడు.
కానీ, అలా లోన్ తీసుకున్న మొత్తంతో అతడు కారును (Car) కొనలేదు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్‌ను భారతీయ స్టేట్ బ్యాంక్‌లో (State Bank of India) విలీనం చేస్తున్న సమయంలో అనిల్ మారుతీ మోసం వెలుగుచూసింది. అంతేగాక కార్ లోన్ పేరిట ఇతను మరికొన్ని సంస్థలను కూడా మోసం చేసినట్లు తేలింది. మొత్తంగా అతడు రూ.1.6 కోట్ల వరకు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన అనిల్ మారుతీ 2014లో న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకునే ముందు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించాడు. 2011లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ కల్బాదేవి బ్రాంచ్‌లో రూ.10 లక్షల కారు లోన్ తీసుకున్నాడు. అయితే, ఈ లోన్ తాలూకు ఒక్క ఈఎంఐ కూడా చెల్లించలేదు. నేరాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యేలోపే అతడు దేశం విడిచి వెళ్లిపోవడంతో అరెస్ట్ చేయడం సాధ్యపడలేదు. కాగా, కరోనా (Covid-19) సమయంలో అనిల్ గైక్వాడ్ న్యూజిలాండ్‌లో ఉద్యోగాన్ని కోల్పోయాడు.
NRI: అమెరికాలోని భారతీయ కుర్రాళ్లూ.. మీరిది విన్నారా..? ఇక్కడ నిరుద్యోగులకు ఫ్రీగా దుస్తులు ఉతికి.. ఇస్త్రీ చేసి మరీ ఇస్తారట..!
ఆ తర్వాత డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే, ఇటీవల ఓ బంధువు చనిపోవడంతో అతడు భారత్‌కు వచ్చాడు. అలా స్వదేశానికి వచ్చిన అతనికి.. తాను బ్యాంక్‌ను మోసం చేసిన విషయం తెలిసిపోయిందని, తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెతుకుతున్నట్లు తెలుసుకున్నాడు. దాంతో వెంటనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, కోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చేసేదేమిలేక అనిల్ మారుతీ తాజాగా పోలీసులకు లొంగిపోయాడు.