Indian: దుబాయిలో 3నెలల కింద కనిపించకుండా పోయిన భారత యువకుడు.. చివరికి..
ABN , First Publish Date - 2023-02-19T10:56:18+05:30 IST
కోటి ఆశలతో దుబాయిలో (Dubai) అడుగుపెట్టి కెరీర్‌ను ప్రారంభించిన ఓ భారత యువకుడి (Indian Youth) జీవితం అర్ధాంతరంగా ముగిసింది.
ఎన్నారై డెస్క్: కోటి ఆశలతో దుబాయిలో (Dubai) అడుగుపెట్టి కెరీర్‌ను ప్రారంభించిన ఓ భారత యువకుడి (Indian Youth) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. మంచి ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడతాడని, తమను బాగా చూసుకుంటాడని ఆశపడిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా అర్థాంతరంగా కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. కేరళకు చెందిన యువకుడు అమల్ సతీష్ (30) ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అయితే, అతడు గతేడాది అక్టోబర్ 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఆ రోజు సాయంత్రం తన గది నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దాంతో తోటి ఉద్యోగులు, స్నేహితులు అమన్ కోసం చాలా వెతికారు. కానీ, ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు.
ఈ విషయం స్వదేశంలోని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు దుబాయ్‌లోని బంధువుల సహాయంతో అక్కడ మిస్సింగ్ కేసు (Missing Case) నమోదు చేయించారు. వారి ఫిర్యాదు మేరకు దుబాయ్ పోలీసులు (Dubai Police) మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఎక్కడ అమన్ జాడ దొరకలేదు. అలా మూడున్నర నెలలు గడిచిపోయాయి. ఈ క్రమంలో తాజాగా అమల్ మృతదేహం రషీదియాలోని ఓ నిర్జన ప్రాంతంలో కనిపించింది. ఒక చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న అమన్ పేరెంట్స్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనతో అమన్ స్వస్థలం కోజికోడ్ జిల్లాలోని కోయిలాండిలో ప్రస్తుతం విషాదం అలుముకుంది.
ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. ఇలాంటి కూతుళ్లున్న తండ్రుల పని ఔటే.. తల్లి వద్ద తండ్రిని ఎలా ఇరికించేసేందో చూడండి..!