NRI: పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన భారత సంతతి మహిళ.. 14 నెలల పాటు నిత్య నరకం..
ABN , First Publish Date - 2023-01-09T21:07:38+05:30 IST
పనిమనిషిని చిత్ర హింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన భారత సంతతి మహిళకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.
ఎన్నారై డెస్క్: పనిమనిషిని(Domestic Help) చిత్ర హింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన భారత సంతతి(Indian Orgin woman) మహిళకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం 14 ఏళ్ల కారాగార శిక్ష(14-Year Jail) విధించింది. నిందితురాలు ప్రేమ. ఎస్. నారాయణస్వామి ఆమె కూతురు పెడుతున్న బాధలు తాళలేక పనిమనిషి పియాంగ్ చనిపోయింది. మయాన్మార్‌కు చెందిన పియాంగ్ 2015లో నిందితుల వద్ద పనిలో చేరింది. ఆ తరువాత ప్రేమ నారాయణస్వామి, ఆమె కూతురు పియాంగ్‌ను చిత్రహింసలు పెట్టారు. ఒంటిపై వేడి నీళ్లు పోయడం, కొట్టడం, తన్నడం, జుట్టు పట్టి లాగడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. నేలపై పడేసి ఈడ్చారు. వారి చేతుల్లో పియాంగ్ నిత్య నరకం అనుభవించింది. కేవలం 14 నెలల్లోనే ఆమె బరువు 24 కేజీలకు పడిపోయింది. చివరి రోజుల్లో పియాంగ్ కాళ్లను గొలుసుతో కిటికీకి నిందితురాలు కట్టేసింది.
ఈ నరకం తాళలేక బాధితురాలు 2016 జులై 26న మరణించింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతోనే ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడింది. అయితే.. పియాంగ్ వెతలన్నీ ఇంటిలోని సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుల బండారం బయటపడింది. తల్లీకూతుళ్లు చివరకు కటకటాలపాలయ్యారు. ప్రేమ నారాయణస్వామి కుమార్తెకు న్యాయస్థానం 2021లో 30 ఏళ్ల కారాగారా శిక్ష విధించింది. పనిమనిషి వేధింపుల కేసులో ఇంతటి భారీ శిక్ష విధించడం సింగపూర్ చరిత్రలో అదే తొలిసారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రేమకు సోమవారం శిక్ష ఖరారైంది.