NRI: మారిన ట్రెండ్.. గతేడాది గోవాలో భారత పౌరసత్వం వదులుకున్న వారు ఎంతమందంటే..

ABN , First Publish Date - 2023-01-09T17:43:33+05:30 IST

భారతీయులు అధిక సంఖ్యలో పౌరసత్వాన్ని వదులుకుంటున్నారన్న ఆందోళనల నేపథ్యంలో గోవాలో ఓ శుభవార్త వెలుగులోకి వచ్చింది.

NRI: మారిన ట్రెండ్..  గతేడాది గోవాలో భారత పౌరసత్వం వదులుకున్న వారు ఎంతమందంటే..

ఎన్నారై డెస్క్: భారతీయులు అధిక సంఖ్యలో తమ పౌరసత్వాన్ని(Indian Citizenship) వదులుకుంటున్నారన్న ఆందోళన నేపథ్యంలో గోవాలో(Goa) ఓ శుభవార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో అక్కడ భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. 2022లో 1,265 మంది మాత్రమే తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు అక్కడి పాస్‌పోర్టు కార్యాలయం తాజాగా వెల్లడించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2015లో 3,873 మంది తమ పౌరసత్వాన్ని వదులుకోగా 2016లో 4,139 మంది, 2017లో 3,643, 2017లో 3,603 మంది విదేశీ పౌరసత్వం కోసం తమ భారతీయ పాస్‌పోర్టులను గోవా కార్యాలయంలో అప్పగించారు. అయితే.. 2019 నుంచి ఈ ధోరణి తగ్గుతూ వస్తోంది. 2019లో 2,927 మంది మాత్రమే భారత పౌరసత్వాన్ని వదులుకోగా కరోనా సంక్షోభం కారణంగా 2020లో 930 మంది, 2021లో 2,835 మంది తమ పాస్‌పోర్టులను సరెండర్ చేశారు. అయితే.. ఈ మార్పుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే.. గోవాలో కొన్ని ప్రాంతాల్లోని వారికి పోర్చుగల్ పౌరసత్వంపై(Portugal Citizenship) ఆసక్తి తగ్గలేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఒకప్పుడు పోర్చుగల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వారు, వారి వారసులకు పోర్చుగల్ పౌరసత్వం సులువుగా లభిస్తుండటంతో గోవా, డమన్ డయూల్లోని కొందరు పోర్చుగల్ పౌరసత్వంపై ఆసక్తి కనబరుస్తున్నారట.

Updated Date - 2023-01-09T17:45:24+05:30 IST