Paidi Rakesh Reddy: ఎడారి జీవితం నుండి అసెంబ్లీ వరకు
ABN , First Publish Date - 2023-12-07T12:42:23+05:30 IST
ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఫైడి రాకేష్ రెడ్డి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఫైడి రాకేష్ రెడ్డి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు గల్ఫ్ ఎడారి దేశాలకు వెళ్లి మాములు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత వివిధ వ్యాపారాలు చేస్తూ ఎదిగి రాజకీయాలలో అరంగేట్రం చేసిన కొద్ది కాలానికే ఇప్పుడు ఏకంగా శాసన సభలో అడుగుపెడుతున్నరాయన. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పైడి రాకేష్ రెడ్డి 29, 302 ఓట్లతో విజయం సాధించారు. ఒకప్పుడు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో అల్ అయిన్ ప్రాంతంలో ఒక మామలు డ్రైవర్‌గా పని చేశారు. తన పని వేళలు ముగిసినా తర్వాత ఓవర్ టైంగా పని చేసి పైసా కూడబెడుతూ ఎదిగిన వ్యక్తి. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చిన్నచితక వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాలతో పాటు ఎర్ర చందనం కలపతో కూడిన ఆకర్షణీయమై కళాఖండాలను విదేశాలకు విక్రయించడం చేశారు. అలాగే ఇతర వ్యాపారాలలో కూడా అడుగు పెట్టిన ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
సంపాదించిన దాంతో సంతృప్తి చెందకుండా రాజకీయాలలో ప్రవేశించాలని కొంత కాలంగా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువయ్యారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరధిలోకి వచ్చే ఆర్మూర్‌లో రాకేష్ రెడ్డి బలమైన అభ్యర్ధిగా భావించి ఏంపీ ధర్మపురి అరవింద్ ఇతన్ని పార్టీలోకి ఆహ్వనించడంతో ఐదు నెలల క్రితం ఆయన బీజేపీలో చేరారు. తన సతిమణీ రేవతి, కూతురు సుచరితలు నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలను చేపట్టి ప్రజలతో మమేకం అయ్యారు. అటు రాకేష్ రెడ్డి రాజకీయ వ్యూహాలు, కుల సమీకరణల వ్యవహారాలను చూశారు. ప్రస్తుత శాసన సభ్యుడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎ. జీవన్ రెడ్డి స్ధానికేతరుడనే వాదనను బలంగా ముందుకు తీసుకువెళ్లారు.
ఇక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కూడా ఎమ్మేల్యే జీవన్ రెడ్డి వ్యవహారశైలీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు, ప్రజలు రాకేష్ రెడ్డికి పట్టం కట్టారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడనే ఏకైక ధీమాతో తనదైన శైలిలో వెళ్ళిన జీవన్ రెడ్డి వైఖరికి నిరసనగా రాకేష్ రెడ్డికి పట్టం కట్టారని తమ బంధువులు తెలిపినట్లుగా గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీయులు పెర్కోంటున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఏ. మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి నుండి గెలిచిన కె. వెంకటరమణా రెడ్డిలకు కూడా గల్ఫ్ దేశాల ప్రవాసీయుల కుటుంబాలు ఓట్ల రూపంలో అండగా నిలిచాయి. ఈ రెండు నియోజకవర్గాల నుండి చెప్పుకోదగ్గ సంఖ్యలో గల్ఫ్‌లో ప్రవాసీయులు ఉండగా వీరి మంచి చెడులు ప్రత్యేకించి మరణించిన సందర్భాలలో ఈ ఇద్దరు నాయకులు వ్యక్తిగతంగా కుటుంబాలను ఆదుకోంటారనే పేరుంది.
మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.