Kuwait: ప్రవాసులకు కువైత్ ఝలక్.. వర్క్ పర్మిట్ రెన్యువల్ నిలిపివేత..!
ABN , First Publish Date - 2023-11-04T07:21:52+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీకి ఇంతకుముందెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీకి ఇంతకుముందెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలో ప్రవాసుల (Expats) ప్రాబల్యం అంతకంతకు పెరుగుతుండడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గడంతో కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని అమలు చేస్తోంది. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో కువైటీలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇక ప్రవాసులకు వర్క్ పర్మిట్ల విషయంలోనూ కువైత్ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (Public Authority of Manpower) ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ పక్రియలో భాగంగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది వలసదారుల వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. జనాభాకు అనుగుణంగా వర్క్ ఫోర్స్ సర్దుబాటు, జాబ్ మార్కెట్‌ను నియంత్రించడంలో ఇది ఒక భాగమని పీఏఎం (PAM) వెల్లడించింది.
Kuwait: కువైత్‌లో అనూహ్య పరిణామం.. భారీగా పెరిగిన డొమెస్టిక్ వర్కర్లు.. అత్యధికులు భారతీయులే!
ప్రవాసులు ఎవరైతే వారి అకడమిక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారో.. వారు సమర్పించిన ఆయా ధృవపత్రాల ప్రామాణికతను ప్రస్తుతం పీఏఎం ధృవీకరిస్తోంది. ఇక ఈ వెరిఫికేషన్‌లో అన్ని ఉద్యోగ వివరణలు అకడమిక్ క్వాలిఫికేషన్‌తో సరిపోలడం వంటివి ఉన్నాయి. ఉదాహరణకు లీగల్ రిసెర్చర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా కలిగి ఉండాలి. అలాగే మీడియా రంగంలో ఉద్యోగం సమాచార మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి ఉంటుంది. ఇలా పలు విషయాలను చాలా పకడ్బందిగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా కువైత్ పూర్తి చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగానే వేర్వేరు రంగాలకు చెందిన ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.