NRI: చమురునాట ఆటపాటలతో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2023-01-16T15:55:59+05:30 IST

దమ్మాం, జుబేల్ నగరాలలో రెండు తెలుగు ప్రవాసీ సంఘాలు వేర్వేరుగా సంక్రాంతి సంబరాలను ఆటపాటలతో అంబరాన్నంటించాయి.

NRI: చమురునాట ఆటపాటలతో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

  • దమ్మాంలో దుమ్ము రేపిన SATS సంక్రాంతి వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మక్కా మదీన పుణ్యక్షేత్రాల కారణాన ముస్లింల ఆధ్యాత్మిక ప్రపంచంలో సౌదీ అరేబియా(Saudi Arabia) అగ్రభాగాన ఉన్నట్లుగా దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న చమురు నిల్వల కారణాన ఆర్థిక జగత్తులో కూడా సౌదీ అరేబియా ఒక ప్రబలమైన స్థానం కలిగి ఉంది. దేశ పరిశ్రమలు, చమురు ఎగుమతులకు నెలవైన ఈశాన్య ప్రాంతంలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉండగా అందులో తెలుగు ప్రవాసీయులు(Telugu NRIs) పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు.

2.jpg తెలుగు వారు ఎక్కడున్నా సంక్రాంతిని(Sankranti Celebrations) మాత్రం సంతోషంగా జరుపుకొంటారు. ఇంకేమి ఈశాన్య ప్రాంతంలోని దమ్మాం, జుబేల్ నగరాలలో రెండు తెలుగు ప్రవాసీ సంఘాలు వేర్వేరుగా సంక్రాంతి సంబరాలను ఆటపాటలతో అంబరాన్నంటించాయి. తమ స్వంత గోదావరి జిల్లాల హంగామా రీతిలో కాకున్నా అవే జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఎడారి నాట సంక్రాంతి సంబరాలతో అందరిలో ఉత్సాహం ఉరకలేయించారు. బతుక వచ్చిన చొట కొత్త అల్లుళ్ళ సందడులు, బావామరదళ్ల సరసాలు లేకున్నా భోగి మంటలు, పిండి వంటలు, కొత్త బట్టల వయ్యారాలతో సంక్రాంతికి వన్నెలు తీసుకొచ్చారు.

3.jpg దమ్మాంలోని సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య (SATS-సాట్స్) సంక్రాంతి సందర్భంగా దుమ్ము రేపింది. ఈశాన్య రాజధాని దమ్మాం కేంద్రంగా పని చేసే సాట్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సంక్రాంతి కార్యక్రమాన్ని విజయవాడకు చెందిన నందమూరి రాజ్య లక్ష్మి, రాజమండ్రికి చెందిన శివ ఆధ్వర్యంలో అందరూ సాంప్రదాబద్ధంగా భోగి మంట కణికల చుట్టు తిరుగుతూ ఆడుతూ పాడుతూ అరంభించారు. దుష్ట శక్తులను తొలగించే రంగోలి డిజైన్లను ఉమా మహేశ్వరరావు, అనితల ఆధ్వర్యంలో నిర్వహించగా జి.సుజాత, లక్ష్మీ దేవి, బి. మహతిలు గెలుపొందారు. సంక్రాంతి ఇతివృత్తంగా మహీ, సమీరా, ఆధ్యా, వేద చేసిన నృత్యాలు అలరించగా చైతన్య చేసిన నృత్య విన్యాసాలు అబ్బురపరిచాయి. కె.వి.యన్.రాజు, సి. అనిత, జె. భ్రమరాంబల ఆధ్వర్యంలో రోజంతా కొనసాగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఉల్లాసపరిచాయి. సందర్భానుసారంగా, సన్నివేశాలకు అనుగుణంగా వసంత, నివేదిత, విజయలక్ష్మి, సంజయ్, కావ్య శ్రీ, రాజు చేసిన వ్యాఖ్యానాలతో సభా ప్రాంగణమంతా సంబరంతో వెల్లివిరిసింది.

4.jpgచిన్నారులకు రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలతో కూడిన భోగి పళ్ళు ఇచ్చే కార్యక్రమం చూడముచ్చటగా జరిగింది. సాట్స్ (సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యా) అధ్యక్షుడు చందగానీ నాగశేఖర్ నేతృత్వంలో వరప్రసాద్, కె.పాపారావు, కె.వి.యన్.రాజు, హరి కిషన్, దిలీప్, ఉమా మహేశ్వరరావులు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. దమ్మాం, అల్ ఖోబర్, జుబేల్, అల్ హస్సా, రాస్ తనురా ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయని సాట్స్ అధ్యక్షులు నాగశేఖర్ తెలిపారు.

5.jpg6.jpg

Updated Date - 2023-01-16T15:57:42+05:30 IST