UAE: బ్లూ కాలర్ వర్కర్స్, విజిట్ వీసాదారులకు ఈ 7 రెస్టారెంట్లలో ఉచిత భోజనం..
ABN , First Publish Date - 2023-03-01T08:00:53+05:30 IST
చారిటీ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సంస్కృతి, సమాజంలో పాతుకుపోయింది.
అబుదాబి: చారిటీ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సంస్కృతి, సమాజంలో పాతుకుపోయింది. అక్కడవారి జీవనంలో ఒక భాగమై పోయింది. ఇది వ్యక్తులకు మాత్రమే పరిమితం కాలేదు. కొన్ని సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. కొన్ని రెస్టారెంట్లు కూడా ఆకలితో ఉన్నవారికి స్వతహాగా ఉచిత భోజనానికి ముందుకు వచ్చాయి. అలా యూఏఈ (UAE) బిలియన్ మీల్స్ చొరవతో గతేడాది రికార్డు స్థాయిలో 600 మిలియన్ మీల్స్ విరాళంగా అందించబడ్డాయి. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆసియా, అరబిక్ రెస్టారెంట్లు బ్లూ కాలర్ వర్కర్లు, విజిట్ వీసాలపై వచ్చిన వారికి ఉచిత మీల్స్‌ను అందిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకంగా అల్పాదాయ దేశాల నుంచి వచ్చిన వారికి కూడా ఉచిత భోజనాన్ని అందిస్తున్నాయి. ఈ రెస్టారెంట్లలో అరబిక్, పాకిస్తానీ, ఆఫ్గానీ, భారతీయ వంటకాలు ఉంటాయి. ఇలా పూర్తి ఉచితంగా భోజనాలు అందిస్తున్న యూఏఈలోని రెస్టారెంట్లు, అవి ఉండే ప్రాంతాల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందా.
ఫౌల్ డబ్ల్యూ హమ్ముస్..
అరబిక్ రెస్టారెంట్‌లో ఎవరూ ఆకలితో అలమటించకూడదని ఫ్రీగా భోజనం అందిస్తుంది. ఈ రెస్టారెంట్‌కు వెళ్లిన వారికి ఫలాఫెల్, మౌతబాల్, ఫైన్ నట్స్‌తో కూడిన హమ్మస్, శాండ్‌విచ్‌లు ఇతర ఆహార పదార్థాలు దొరుకుతాయి.
ఫట్టా కరవారెహ్..
అబు హైల్‌లో ఉండే ఈ ఈజిప్షియన్ ఈటరీ ఆకలితో ఉన్న వారికి ఉచిత భోజనాన్ని అందిస్తోంది. గతేడాది పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొందరు భోజనానికి వెచ్చించే స్తోమతలేక రెస్టారెంట్ వద్ద దీనంగా కూర్చొవడం చూసి తాము ఈ ఫ్రీ మీల్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మేనేజర్ అతియా యూసెఫ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఈ రంజాన్‌కు యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీ జేబుకు చిల్లే..!
భారతీయ రెస్టారెంట్.. రుచికరమైన దోసకు ఫేమస్..
రక్తదానం చేసే వ్యక్తులకు ఉచితంగా భోజనం అందిస్తుందీ భారతీయ రెస్టారెంట్. రక్తదాతలకు ఎల్లప్పుడు భోజనం అందుబాటులో ఉంటుంది. రక్తదాన రశీదు ఉన్న వ్యక్తులు.. దుబాయి, షార్జాలోని మూడు రెస్టారెంట్లలో దేనినైనా సందర్శించి పూర్తి ఉచితంగా బోజనం చేయవచ్చు. అలాగే భోజనం కోసం డబ్బులు లేని వారికి కూడా ఉచితం మీల్స్ అందిస్తామని యమ్మీ దోస మేనేజింగ్ డైరెక్టర్ జుగల్ పరేఖ్ చెప్పారు.
కరాచీ స్టార్..
పాకిస్తానీ, భారతీయ వంటకాలను అందించే ఈ రెస్టారెంట్ పేదలకు, విజిట్ వీసాలపై వచ్చిన వలసదారులకు ఉచితంగా మీల్స్ పెడుతోంది. "నిరుద్యోగులు, విజిట్ వీసాపై వచ్చినవారు, వీసా గడువు ముగిసిన వారు షార్జాలోని మువీలా, సజాలో ఉన్న మా రెస్టారెంట్‌లకు రావచ్చు. మేము వారికి ఉచితంగా భోజనం అందించడం జరుగుతుంది" అని కరాచీ స్టార్ ఓనర్ షాహిద్ అస్గర్ బంగాష్ తెలిపారు.
షిన్వారీ టిక్కా..
దీరాలో ఉన్న ఈ రెస్టారెంట్ సహాయం కోరే ఎవరికైనా ఉచిత భోజనాన్ని అందిస్తుంది. సగటున రోజుకు నలుగురు వ్యక్తులు ఫ్రీ మీల్స్ కోసం వస్తారని రెస్టారెంట్ యజమాని ఖైర్ అల్ అమీన్ వెల్లడించారు. కొన్నిసార్లు ఈ సంఖ్య పదులలో కూడా ఉంటుందని, ఎవరినీ ఖాళీ కడుపుతో పంపబోమని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: డాక్టర్ మజ్హర్ అలీ ఖాన్ ఆత్మహత్య.. ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలుసా?.. ఏకంగా ఒమన్ రాజుతో..
ఖైర్ దర్బార్..
అల్ క్వోజ్‌లోని ఈ రెస్టారెంట్ బ్లూ కాలర్ వర్కర్లు లేదా ఆకలితో తమ వద్దకు వచ్చి డబ్బులు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఉచితంగా భోజనం అందిస్తుంది.
పాక్ ఖైర్ దర్బార్..
పాకిస్థానీ, భారతీయ వంటకాలను అందించే ఈ పాక్ రెస్టారెంట్ దీరా దుబాయ్‌లో ఉంది. ఆకలిలో ఉన్నవారికి ఫ్రీ మీల్స్ అందిస్తూ దాతృత్వాన్ని చాటుతోంది.