H-1B Visa: కోతల వేళ తీపి కబురు.. వారికి లైన్ క్లియర్.. హాయిగా పనిచేసుకోవచ్చు.. ఖుషీఖుషీగా భారతీయ టెకీలు!
ABN , First Publish Date - 2023-03-31T07:41:15+05:30 IST
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవచ్చని కొలంబియా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు
కొలంబియా జిల్లా కోర్టు తీర్పు
వాషింగ్టన్, మార్చి 30: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవచ్చని కొలంబియా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు ప్రత్యేకించి భారీ సంఖ్యలో ఉన్న భారతీయులకు ఇది ఊరట కలిగించనుంది. హెచ్-1బీ అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న లేదా సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీయులను నియమించుకునేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. ఏటా భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చిన వేలాదిమందిని నియమించుకోడానికి టెక్నాలజీ కంపెనీలు హెచ్-1బీ వీసాదారులపైనే ఆధారపడతాయి. కొన్ని కేటగిరీలకు చెందిన హెచ్-1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములను ఉద్యోగాల్లో నియమించుకొనేందుకు ఆథరైజేషన్ కార్డులు ఇచ్చేలా ఒబామా కాలంలో నిబంధన తీసుకొచ్చారు. వీటి వల్ల ఇప్పటి వరకు లక్ష మందికిపైగా భారతీయ హెచ్- 1బీ వీసాదారుల జీవితభాగస్వాములు ఉద్యోగాలు చేసుకొనేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ పొందారు.
వీరిలో అత్యధికులు మహిళలే. అయితే ఆ నిబంధనను కొట్టివేయాలంటూ అమెరికాకు చెందిన ఐటీ ఉద్యోగులతో ఏర్పాటైన ‘సేవ్ జాబ్స్ యూఎ్‌సఏ’ అనే సంఘం దావా వేసింది. హెచ్-1బీ వీసాదారులతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆ సంఘం ఆక్షేపించింది.అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర టెక్ కంపెనీలు ఈ దావాను వ్యతిరేకించాయి. 2015 నుంచి ఆ దావాపై సుదీర్ఘ విచారణ సాగింది. కొలంబియా జిల్లా జడ్జి టాన్యా చుట్కన్ తాజాగా ఆ దావాను కొట్టివేశారు. అమెరికాలో ఉంటున్న హెచ్-4 తదితర వీసాదారుల జీవిత భాగస్వాములను అమెరికాలో ఉద్యోగం చేసుకొనేందుకు అనుమతించేలా అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్ అధికారాలిచ్చిందని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పును వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న అజయ్ భుటారియా ప్రశంసించారు.