NATS: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సౌజన్యంతో నాట్స్ ఆధ్వర్యంలో 'సుదర్శన క్రియ'
ABN , First Publish Date - 2023-08-30T12:53:33+05:30 IST
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సౌజన్యంతో చికాగోలో 'స్కై బ్రీత్ మెడిటేషన్' కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించింది.
చికాగో, ఆగస్ట్ 29: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సౌజన్యంతో చికాగోలో 'స్కై బ్రీత్ మెడిటేషన్' కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించింది. మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడి నివారణకు చిట్కాలు ఈ కార్యక్రమంలో వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సుదర్శన క్రియను ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న అందరి చేత చేయించింది. మానసిక ఆందోళన, పని ఒత్తిడి అన్నింటిని జయించేలా మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ కార్యక్రమంలో నేర్పించారు.
చాలా మంది తెలుగువారు ఈ సుదర్శన క్రియ నేర్చుకుని ఇక ముందు తమ జీవితంలో దీనిని భాగంగా చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాట్స్ చికాగో విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జీవితానికి ఎంతో ఉపయోగపడే సుదర్శన క్రియపై కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ చికాగో విభాగాన్ని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులను నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు)నూతి ప్రత్యేకంగా అభినందించారు.