TAGKC: టీఏజీకేసీ ఆధ్వర్యంలో కాన్సాస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
ABN , First Publish Date - 2023-11-15T06:50:30+05:30 IST
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూల్ (Blue Valley North High School) లో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
కాన్సాస్: అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూల్ (Blue Valley North High School) లో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగు వారు పాల్గొన్నారు. చక్కని ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. కార్తిక్ వాకాయల, శ్రీ లేఖ కొండపర్తి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
చిన్నపిల్లలు, పెద్దవారు చేసిన మన తెలుగు సంప్రదాయాన్ని సూచించే కూచిపూడి, భరత నాట్యం, చక్కని జానపద, శాస్త్రీయ నృత్యాలు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని అలరించాయి. వాటితో పాటు ఎన్నో కొత్త సినిమా పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులకు ఉత్సాహం తెప్పించాయి. ఈ వేడుకలో టీఏజీకేసీకి సేవలు అందించిన మంజుల సువ్వారి, సుచరిత వాసంలను సంస్థ ఎగ్జిక్యూటి కమిటీ అధ్యక్షుడు నరేంద్ర దూదెళ్ళ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీధర్ అమిరెడ్డి, కార్యవర్గ సంఘం సత్కరించింది.
అలాగే పలు అంశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ధృవపత్రాలు ఇచ్చి సత్కరించారు. రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.చిన్న పిల్లల నృత్యాలే కాకుండా పెద్ద వాళ్లు చేసిన నృత్యాలు, "ఆది శంకరాచార్య" నాటిక, శ్రీరామునికి సంబంధించిన నృత్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాని తరువాత టీఏజీకేసీ ఉపాధ్యక్షులు చంద్ర యక్కలీ చెప్పిన ఓట్ ఆఫ్ థ్యాంక్స్, జనగణమనలతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. చివరగా కార్యక్రమానికి వచ్చిన వారికి బాక్సులలో చక్కని తెలుగు భోజనం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహాయ పడ్డ కార్యకర్తలందరికీ, స్పాన్సర్లకి టీఏజీకేసీ కార్యనిర్వాహక కమిటీ, ట్రస్ట్ బోర్డు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.