Foreign Tour Packages: విదేశీ టూర్లకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!
ABN , First Publish Date - 2023-08-16T07:52:30+05:30 IST
విదేశీ పర్యటన అనేది చాలామంది మధ్యతరగతి ప్రజలకు ఒక కల. ఎంతోకొంత వెనకేసుకుని ఎప్పుడైనా వీలు చిక్కితే ఏదైనా బయటి దేశాన్ని తిరిగి రావాలని కోరుకోనివారు అరుదుగానే ఉంటారని చెప్పాలి.
విదేశీ పర్యటనల ప్యాకేజీలపై 20శాతం పన్ను అక్టోబరు నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, ఆగస్టు 15: విదేశీ పర్యటన అనేది చాలామంది మధ్యతరగతి ప్రజలకు ఒక కల. ఎంతోకొంత వెనకేసుకుని ఎప్పుడైనా వీలు చిక్కితే ఏదైనా బయటి దేశాన్ని తిరిగి రావాలని కోరుకోనివారు అరుదుగానే ఉంటారని చెప్పాలి. అయితే, ఇకపై ఇలాంటి పర్యటనలకు సొంతంగా వెళ్తే పర్లేదు గానీ ఏదైనా సంస్థ ద్వారా ప్యాకేజీ మాట్లాడుకుని వెళ్తే మాత్రం విహారం కాస్తా భారంగా మారడం ఖాయం. ఈ ఏడాది అక్టోబరు నుంచి అమలులోకి రానున్న కొత్త పన్ను విధానంలో పర్యటన ప్యాకేజీపై 20శాతం టీసీఎ్‌స(ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్)ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ విదేశీ టూర్ ప్యాకేజీలకు 5శాతం పన్ను చెల్లిస్తుండగా.. దాన్ని కొత్త విధానంలో ఒక్కసారిగా 20శాతానికి సర్కారు పెంచడం గమనార్హం. ఉదాహరణకు ఒక విదేశీ పర్యటన ప్యాకేజీ విలువ రూ. 5 లక్షలు అనుకుంటే, టీసీఎ్‌సగా రూ. లక్ష అదనంగా పర్యాటకులు చెల్లించక తప్పదు. విదేశీ పర్యటనలకు ఇది భారం అయినప్పటికీ.. దేశీయ పర్యాటకానికి మంచి ఊతం ఇస్తుందని పరిశీలకులు వివరిస్తున్నారు. ఉదాహరణకు శీతల దేశాల పర్యటనలకు బదులు భారత్‌లోనే శీతల ప్రాంతాలకు, హిల్ స్టేషన్లకు వెళ్లే దిశగా ప్రజలు యోచిస్తారని, ఇది దేశానికి ఆదాయాన్ని మరింతగా పెంచుతుందని చెబుతున్నారు.
పరిష్కారం లేదా..?
పన్ను పోటు నుంచి తప్పించుకునేందుకు గాను కొంతమంది విదేశీ పర్యాటక సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. అక్కడి వారి ద్వారానే విమాన టికెట్లు, హోటల్ గదులు, ఇతర బుకింగ్‌లు చేసుకుంటే టీసీఎస్ భారం తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అటు.. ఐటీ రిటర్నుల దాఖలు సమయంలో పర్యటన వివరాలను సమర్పిస్తే అందులో ఆ మొత్తం సర్దుబాటు జరిగేందుకు అవకాశముంది. కానీ ప్రతి రూపాయి కష్టపడి పోగేసుకునే మధ్యతరగతి మనిషికి ఆ అదనపు పన్ను మొత్తాన్ని కూడా ముందుగా సేకరించాల్సి ఉండటం భారం కానుంది. ఆ పన్ను మినహాయింపు పొందేందుకు సైతం ఏడాదిపాటు ఎదురుచూడక తప్పదు.