TAL: 'తాల్' సంక్రాంతి సంబరాలు 2023
ABN , First Publish Date - 2023-01-30T13:09:03+05:30 IST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (Telugu Association Of London) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 28వ తేదీన (శనివారం) ఈస్ట్ లండన్‌లో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (Telugu Association Of London) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 28వ తేదీన (శనివారం) ఈస్ట్ లండన్‌లో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లండన్, పరిసర ప్రాంతాల నుంచి సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు. బొమ్మల కొలువు, భోగి పళ్ళు, రంగు రంగుల ముగ్గుల పోటీ, వంటల పోటీ, గాలి పటాల పోటీలతో కళకళలాడిన ఆవరణలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. 'తాల్' సాంస్కృతిక కేంద్రం విద్యార్థుల వివిధ పాటలు, నృత్యాలతో అందరిని అలరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
మహిళలు అధిక సంఖ్యలో తమతమ ఇళ్లలో తయారుచేసి తీసుకువచ్చిన సాంప్రదాయ వంటకాలతో ఈ సంబరాలకు విచ్చేసిన వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. రెడ్ బ్రిడ్జ్ కౌన్సిల్ మేయర్ తావతురే జయరంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా 'తాల్' చేపడుతున్న సేవ, సాంసృతిక కార్యక్రమాలను కొనియాడారు. అయిదు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
'తాల్' వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి మాట్లాడుతూ.. ఈ సంస్థ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న తల్లిదండ్రులు, తాల్ సభ్యులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్టీ గిరిధర పుట్లూర్ తాల్ సాంస్కృతిక కేంద్రం(TCC) నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వివరాలు తెలియజేశారు. 'తాల్' సాంస్కృతిక కేంద్రాలలో తమ పిల్లలను చేర్పించి, భావి తరాలకి తెలుగు భాష, సంస్కృతిని అందించేలా సహకరించాలని తెలుగు వారిని కోరారు.
'తాల్' సంక్రాంతి సంబరాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన సబ్ కమీటీ సభ్యులు రాయ్ బొప్పన్న, విజయ్ బెలిదే, హిమబిందు, ఉమా గీర్వాణి, శ్రీదేవి అల్లెద్దుల, అనిల్ రెడ్డి, దివ్య రెడ్డి, సుజాత గాదంసేతి, హరిణి గెడ్డం, అశోక్ మాడిశెట్టి, ఇతర వాలంటీర్లు అందరికి కల్చరల్ ట్రస్టీ నవీన్ గాదంసేతి కృతఙ్ఞతలు తెలిపారు. 'తాల్' ట్రస్టీలు అనిల్ అనంతుల (సెక్రటరీ), కిషోర్ కస్తూరి (ఐటీ), రవీందర్ రెడ్డి గుమ్మకొండ (ఫండ్‌రైజింగ్), అనిత నోముల(స్పోర్ట్స్) కూడా ఇందులో పాల్గొన్నారు. విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమానికి ఆద్యంతం సమయస్ఫూర్తితో వ్యాఖ్యాతగా వ్యవహరించిన RJ శ్రీవల్లిని అందరూ అభినందించారు.