NRI: ‘సాటా’ సంక్రాంతితో పరవశించిన పెట్రో కెమికల్స్ నగర తెలుగు ప్రవాసీయులు

ABN , First Publish Date - 2023-01-16T20:22:47+05:30 IST

‘సాటా’ ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయుల సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

NRI: ‘సాటా’ సంక్రాంతితో పరవశించిన పెట్రో కెమికల్స్ నగర తెలుగు ప్రవాసీయులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తన చమురు ఉత్పాదకతతో సౌదీ అరేబియా(Saudi Arabia) విశ్వవ్యాప్తంగా ఒక ప్రత్యేక, ప్రబల స్థానం కలిగి ఉంది. సౌదీలోని చమురు నిక్షేపాలలో అత్యధిక భాగం ఈశాన్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ చమురుతో పాటు దాని అనుబంధ రసాయనాల పరిశ్రమలు కూడా భారీగా ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని జుబేల్ నగరం పెట్రో కెమికల్స్ పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇక్కడి పెట్రో కెమికల్ రంగంలో భారతీయులు.. అందునా తెలుగు ప్రవాసీయులు కూడా పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు.

రసాయనాల ఉత్పత్తి నగరమైతేనేమి సంక్రాంతి రంగోలి పోటీలకు, ఆకర్షణీయమైన ముగ్గులకు నగరం ఎంతో అనువైందంటారు ఇక్కడి తెలుగు ప్రవాసీయులు. ఈశాన్య ప్రాంతంలోని దమ్మాంలో తెలుగు ప్రవాసీ సంఘం సాట్స్‌కు తోడు జుబేల్ నగరంలో మరో తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కూడా వేర్వేరుగా సంక్రాంతి సంబరాలను ఆటపాటలతో అంబరాన్నంటించింది. తమ స్వంత గోదావరి జిల్లాల హంగామా రీతిలో కాకున్నా అదే జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఎడారి నాట సంక్రాంతి సంబరాలతో అందరిలో ఉత్సాహం ఉరకలేయించారు. బతుక వచ్చిన చోట కొత్త అల్లుళ్ళ సందడులు, బావామరదళ్ల సరసాలు లేకున్నా భోగి మంటలు, పిండి వంటలు, కొత్త బట్టల వయ్యారాలతో సంక్రాంతికి వన్నెలు తీసుకువచ్చారు.

2.jpg

ఒకప్పుడు పోర్చుగీసు పాలకులు ఓడల ద్వారా విశ్వవ్యాప్తంగా వనరులు కలిగిన అనేక దేశాలలో పాగా వేసినట్లుగా వందలాది వాట్సప్ గ్రూపుల ద్వారా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయులను చేరుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్న సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) జుబేల్‌లో సంక్రాంతి సందడి చేసింది. శుక్రవారం రోజంతా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సాటా ఈశాన్య విభాగం ప్రతినిధులు తేజ, అవినాష్, భాను ప్రకాశ్, జి.పి.యస్. కిషోర్, తారక్ అన్ని తామై నడిపించారు.

వ్యాఖ్యాతగా శిల్పా గురుజ తన మాటల గారడీతో సభికులను కట్టిపారేయగా, సౌజన్య శ్రీకుమార్ ఆలపించిన తెలుగు, హిందీ సినిమా పాటలతో సభికులు పరవశించిపోయారు. సౌజన్య కూతురు అయిన శ్రీయా.. శివ శివ శంకర పాటకు చేసిన నృత్య ప్రదర్శన కూడా అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

3.jpg

జుబేల్ నగరంలో తెలుగు సమాజానికి భీష్మపితామహుడని పిలిచే దాసరి భిక్షపతితో పాటు తెలుగు ప్రముఖులు నగేశ్, చింతల మూర్తి, ఉమా మహేశ్వరరావు, జహీర్ బేగ్, బాలసాని లక్ష్మీనారాయణులను ఈ సందర్భంగా సన్మానించారు. మేడిబోయిన తారక్, కిషోర్ గురుజు, సలాదుల పవన్ కుమార్, నమ్మి రామారావు, పలపాల జగదీష్, సత్య శ్రీకాంత్, మహేశ్ కె.పి, భానుప్రకాశ్, వరప్రసాద్, అనీల్, పార్థసారధి, జయప్రకాశ్ కొత్తపల్లి, దాసరి సూర్య, రాకేశ్,నవ్య, విజయ, జస్మిత, దివ్య, లలిత, సౌజన్య, ప్రవీణ, సంధ్య కార్యక్రమాన్ని సమన్వయంచేసారు. రియాధ్ నుండి కూడా ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు సంక్రాంతి కొరకు జుబేల్‌కు రావడం జరిగింది. సాటా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లేశన్, ముజమ్మీల్ షేఖ్, సాటా రియాధ్ విభాగం అధ్యక్షులు జి.ఆనందరాజు, సూర్య ప్రకాశ్, గోవిందరాజు, సుబ్బులతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన పర్యావరణ చిత్రకారుడు, నేషనల్ జియోగ్రఫీ ట్రావెల్ అవార్డు గ్రహిత హింకర్ వల్లూరిలు ప్రత్యేకంగా పాల్గొన్నారు.

4.jpg1.jpg

Updated Date - 2023-01-16T20:37:19+05:30 IST