UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. కొత్త పెనాల్టీలు ప్రకటించిన యూఏఈ..!
ABN , First Publish Date - 2023-11-29T08:57:19+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) అధికారులు తాజాగా ఇతరులపై దాడి చేస్తే భారీ పెనాల్టీలు ఉంటాయని ప్రకటించింది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షలు ఉంటాయని వెల్లడించింది.
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) అధికారులు తాజాగా ఇతరులపై దాడి చేస్తే భారీ పెనాల్టీలు ఉంటాయని ప్రకటించింది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 'ఎక్స్' (ట్విటర్) ద్వారా కీలక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా మరొకరిపై ఏ విధంగానైనా సరే దాడి చేసిన సందర్భంలో బాధితుడు 20 రోజుల కంటే ఎక్కువ కాలం ఇంట్లో ఉండిపోవాల్సి వస్తే.. దాడి చేసిన వ్యక్తికి 10వేల దిర్హమ్స్ (రూ.2.26లక్షలు) జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. అలాగే గర్భిణీపై దాడి చేసి ఆమెకు గర్భస్రావమైతే, అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని అథారిటీ పేర్కొంది. ఇక తాజాగా ప్రకటించిన పెనాల్టీలు 2021లో తీసుకువచ్చిన ఫెడరల్ డిక్రీ- లా నం. 31లోని ఆర్టికల్ 390కి అనుగుణంగా విధించడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశ పౌరులు, ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.