Dubai Visit Visa: విదేశీ విజిటర్లకు యూఏఈ బిగ్ షాక్..!

ABN , First Publish Date - 2023-06-02T09:32:28+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఆ దేశానికి వెళ్లే విదేశీ విజిటర్లకు షాక్ ఇచ్చింది.

Dubai Visit Visa: విదేశీ విజిటర్లకు యూఏఈ బిగ్ షాక్..!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఆ దేశానికి వెళ్లే విదేశీ విజిటర్లకు షాక్ ఇచ్చింది. టూరిస్ట్ వీసాలపై వెళ్లే సందర్శకులు వారి వీసా గడువు ముగిసిన తర్వాత దేశం నుంచి వెళ్లేందుకు ఇప్పటివరకు ఇస్తున్న 10 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలిగించాలని నిర్ణయించింది. అంటే.. ఇకపై వీసా గడువు ముగిసిన విజిటర్లు వెంటనే ఆ దేశం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (Federal Authority for Identity, Citizenship, Customs and Port Security) ప్రకటన చేయనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ట్రావెల్ ఏజెంట్లు ఇప్పటికే తమ క్లయింట్‌ల వద్ద ఈ కొత్త ఆదేశాల గురించి ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.

ఇకపై గ్రేస్ పీరియడ్ లేదు. వీసా రకాన్ని బట్టి దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి బస వ్యవధి (30 రోజులు లేదా 60 రోజులు) ఉంటుందని కొత్త నిబంధనలను ట్రావెల్ ఏజెంట్లు తమ క్లయింట్లకు చెబుతున్నారు. ఇంతకుముందు వీసా గడువు ముగిసిన సందర్శకులకు దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు పది రోజుల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉండేది. ఆ గడువులోపు వెళ్లేవారు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత ఆ దేశంలో ఉంటే రోజుకు 50 దిర్హమ్స్ (రూ. 1,120) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అటు వీసాలు రెన్యువల్ చేసుకోకుండా ఉండే టూరిస్టులపై కూడా ఇకపై కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాంటివారిని అక్రమంగా దేశంలో ఉంటున్నందుకు అరెస్టు చేస్తామన్నారు. ఇకపై నేరస్తులను పట్టుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Saudi Arabia: భారతీయుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై మనోళ్లకు ఆ టెస్టు తప్పనిసరి..!


Updated Date - 2023-06-02T09:32:28+05:30 IST