US Immigration Rules: ఎన్నారైలకు ప్రయోజనం కలిగేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భారత చిన్నారులకు..
ABN , First Publish Date - 2023-02-16T07:18:18+05:30 IST
అమెరికాకు వలస వెళ్లిన భారతీయులకు ప్రయోజనం కలిగేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ చిన్నారులకు శాశ్వత నివాస హోదా!
వాషింగ్టన్, ఫిబ్రవరి 15: అమెరికాకు వలస వెళ్లిన భారతీయులకు ప్రయోజనం కలిగేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీఎస్‌పీఏ) కింద నిర్దిష్ట పరిస్థితుల్లో వలసదారుడి వయస్సుని లెక్కించే అంశంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు కాని చిన్నారుల వయసు నమోదు ప్రక్రియలో భాగంగా పాలసీ మాన్యువల్‌ను సవరించింది. ఈ చర్య చిన్నదే అయినప్పటికీ తమ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ శాశ్వత వీసా పొందేందుకు వయసు పరిమితి దాటిన వారు ఎదుర్కొంటున్న సమస్యకు చక్కని పరిష్కారం చూపనుంది. శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు ఆధారంగా ఆయా చిన్నారులు అమెరికాలో నివసించాలంటే 21 ఏళ్లలోపు వయసువారై ఉండాలి. ఇలా భారత్ నుంచి వెళ్లిన దాదాపు 2 లక్షల మందికిపైగా శాశ్వత వీసా పొందే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బైడెన్ సర్కారు దీన్ని సరిదిద్దింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం సీఎస్‌పీఏ కోసం ఈ వలసదారుల వయసును లెక్కించే క్రమంలో యూఎస్ సిటిజన్‌షిప్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐసీ) ‘ఫైనల్ యాక్షన్ డేట్ చార్ట్’కి బదులుగా ‘డేట్స్ ఆఫ్ ఫైలింగ్ చార్ట్’ని పరిగణనలోకి తీసుకుంటుందని చిన్నారుల శాశ్వత నివాస హోదా కోసం కృషి చేస్తున్న దీప్ పటేల్ వెల్లడించారు.