NRIs: ‘ఇండియా గివింగ్ డే’.. ఎన్నారైలకు మాతృభూమి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం!
ABN , First Publish Date - 2023-02-28T12:56:52+05:30 IST
భారత దేశానికి సంఘీభావంగా, భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్నారైలు (NRIs), ఇండో-అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 2023, మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’ను (India Giving Day) నిర్వహించబోతున్నాయి.
ఎన్నారై డెస్క్: భారత దేశానికి సంఘీభావంగా, భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్నారైలు (NRIs), ఇండో-అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 2023, మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’ను (India Giving Day) నిర్వహించబోతున్నాయి. ఇండియా ఫిలాంత్రఫీ అలయెన్స్(IPA) పేరుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 'అగస్త్య యూఎస్ఏ'తో పాటు అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి. అమెరికాలోని ఎన్నారై, ఇండో అమరికన్ల సమూహంలో ముఖ్యంగా యువతీయువకులలో దాతృత్వ గుణం పెంపొందించేందుకు ‘ఇండియా గివింగ్ డే’ ఒక సువర్ణావకాశం. ఈ ఇండియా గివింగ్ డే లో పాల్గొంటున్న 'అగస్త్య యూఎస్ఏ' సంస్థ అమెరికాలోని ఎన్నారైలు, ఇండో అమెరికన్ల నుంచి విరాళాలను ఆశిస్తోంది. అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రవాస భారతీయులు 24 గంటల చారిటబుల్ డ్రైవ్‌లో పాల్గొని, తమ మాతృభూమి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం ఇండియా గివింగ్ డే కల్పిస్తోంది.
అమెరికాలో నివసిస్తోన్న 2.7 మిలియన్ల ప్రవాస భారతీయులు (Indian), అమెరికాలో పుట్టిన భారతీయ సంతతికి చెందిన 1.3 మిలియన్ల ఇండో-అమెరికన్ల (Indo-American) నుంచి విరాళాలను ఆశిస్తోంది. అంతర్జాతీయ అభివృద్ధిలో విరాళాలు పోషించే పాత్రపై ఆసక్తి ఉన్న ఒక నిపుణుడిగా ఈ నిధుల సేకరణ డ్రైవ్ ద్వారా భారతదేశానికి, భారతీయులకు మద్దతుగా భారీగా విరాళాలు వస్తాయని ఆశిస్తున్నానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella) అన్నారు. 2022 గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా భారతదేశంలో 228.9 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వాన్ని మెరుగుపరిచేందుకు, పేదరికంలో ఉన్న భారతీయుల ఇతర ముఖ్యమైన అవసరాలను తీర్చే ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడానికి ఈ విరాళాలను సేకరిస్తున్నారు.
భారతదేశంలో అభివృద్ధి మరియు మానవతావాద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే 14 లాభాపేక్ష రహిత సంస్థల సంకీర్ణ కూటమి ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కూటమి సభ్యులు ఇప్పటికే అమెరికాలో సంవత్సరానికి దాదాపు 60 మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించారు. వార్షిక సింగిల్-డే పుష్ నిర్వహించడం ద్వారా సమిష్టిగా ఒక్కరోజులో మరిన్ని నిధులను సేకరించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని నలుమూలలా నివసించే వారి నుంచి విరాళాలను ఈ కూటమి స్వాగతిస్తోంది. కానీ, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్లు మరియు ప్రవాస భారతీయుల నుంచి చందాలు, విరాళాలు సేకరించడమే ఈ ఈవెంట్ లక్ష్యం. పిల్లల హక్కుల కోసం ఏర్పడిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్రై అమెరికా (CRY America), భారత్‌లో గ్రామీణ ప్రాంతాభివృద్ధి కోసం ఏర్పడిన సెహగల్ ఫౌండేషన్ వంటి వాటికి విరాళాలు సేకరించడం కూడా ఈ ఈవెంట్ ఉద్దేశ్యం.
అమెరికాలో ఈ ఒక్కరోజు విరాళాలు, గివింగ్ డేస్, రకరాల విషయాలపై అవగాహన కోసం ఫండ్ రైజింగ్, కొన్ని ప్రత్యేకమైన సంస్థల కోసం విరాళాలు సేకరించడం వంటివి గత 15 సంవత్సరాలుగా సర్వసాధారణమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, అనేక ఇతర సంస్థల విరాళాల కోసం చాలా కార్యక్రమాలున్నాయి. కానీ, వీటన్నింటిలోకెల్లా 'గివింగ్ ట్యూస్ డే' అత్యంత ప్రజాదరణ పొందింది. 'థ్యాంక్స్ గివింగ్' తర్వాత వచ్చే మొదటి మంగళవారం నిర్వహించే ఈ 'గివింగ్ ట్యూస్ డే' బాగా పాపులర్. 2022లో వివిధ కారణాలు, లక్ష్యాల కోసం 'గివింగ్ ట్యూస్ డే' నాడు 3 బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి.