AP Politics : వైసీపీ నేతలను మించిపోయిన రాపాక.. వైఎస్ జగన్‌ను ఈ రేంజ్‌లో ప్రసన్నం చేసుకోవడం వెనుక..!
ABN , First Publish Date - 2023-05-20T23:37:44+05:30 IST
అవును.. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Vara Prasada Rao) వైసీపీ నేతలను (YSRCP Leaders) మించిపోయి ప్రవర్తిస్తున్నారు. నిద్ర లేచింది మొదలుకుని పడుకునే వరకు వైఎస్ జగన్.. వైఎస్ జగన్ (YS Jagan) అని తెగ కలవరిస్తున్నారు.
అవును.. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Vara Prasada Rao) వైసీపీ నేతలను (YSRCP Leaders) మించిపోయి ప్రవర్తిస్తున్నారు. నిద్ర లేచింది మొదలుకుని పడుకునే వరకు వైఎస్ జగన్.. వైఎస్ జగన్ (YS Jagan) అని తెగ కలవరిస్తున్నారు..! వీలుదొరికినప్పుడల్లా కాదు.. వీలుచేసుకుని మరీ అసెంబ్లీ, బహిరంగ సభలు, ప్రెస్‌మీట్లలో ఇలా ఎక్కడ చూసినా సీఎంను తెగ పొగిడేస్తున్నారు..! ఇదేంట్రా బాబోయ్.. రాపాక ఈ రేంజ్‌లో జగన్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారని వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి.. ‘దైవ సమానులు’ అంటూ నానా హడావుడి చేసేస్తున్నారు. దైవ సమానులు అని జగన్‌ను ఇంతలా ఎందుకు ప్రసన్నం చేసుకుంటున్నారు..? ఇప్పుడు సోషల్ మీడియాలో రాపాకపై జరుగుతున్న చర్చేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..
ఒక పార్టీ అధినేత.. అందులోనూ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తడం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు పెద్ద విషయమేమీ కాదు. అయితే ఏపీలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. జనసేన (Janasena) తరఫున రాజోలు (Razole) నుంచి గెలిచిన వన్ అండ్ ఓన్లీ రాపాక వరప్రసాద్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గెలిచింది జనసేన నుంచి అయినా వైసీపీ ఎమ్మెల్యేలాగా ప్రవర్తిస్తున్నారు. గతంలో తన కుమారుడ్ని మాత్రమే వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేర్చిన ఈయన ఆ మరుక్షణం నుంచే సీఎం, వైసీపీ డబ్బా కొట్టడం మొదలెట్టేశారు. సమయం, సందర్భంగా వచ్చినప్పుడల్లా జగన్‌పై విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా.. జగన్‌ను ఈ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేస్తున్నారేంటి..? అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. అంతేకాదు.. సొంత పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలే ‘గడప గడపకు మన ప్రభుత్వం’.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాలకు వెళ్లాలంటే జంకుతున్న పరిస్థితి. రాపాక మాత్రం జనాల్లో తెగ తిరిగేస్తూ.. బ్యాగు తగిలించుకుని ఎగేసుకుని మరీ వెళ్లి ఇంటింటికీ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కాస్త నిశితంగా పరిశిలీస్తే రాపాక ఎందుకిలా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఏందయ్యో ఇది..!
పైన చెప్పిన వన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరో అడుగుముందుకేసి తన కుమారుడి పెండ్లి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫొటో ప్రింట్ చేయించి స్వామి భక్తిని చాటుకున్నారు. అది కూడా.. ‘మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో..’ అంటూ అచ్చు వేయించడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా ఈ వెడ్డింగ్ కార్డ్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు ఆహా.. ఓహో అని కామెంట్స్ చేస్తుండగా.. జనసేన, సామాన్యులు మాత్రం ఇదేం ఖర్మరా బాబోయ్ అని దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి మరీ ఈ రేంజ్‌లో భజన చేస్తున్నారెందుకో అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పనిలో పనిగా జగన్ మీదున్న కేసులు కూడా ముద్రించలేకపోయావా..? అని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.
ఓహో ఇందుకేనా..!?
రానున్న ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరఫున పోటీచేయాలని రాపాక తహతహలాడుతున్నారట. గతంలో ఆయన గెలిచింది జనసేన తరఫున.. భజన చేస్తున్నది, మద్దతిచ్చింది వైసీపీకే.. ఇక మళ్లీ జనసేన తరఫున టికెట్ ఛాన్స్ లేదు. అందుకే ఇక ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వైసీపీ మాత్రమే. టికెట్ దక్కించుకోవాలంటే ఇప్పట్నుంచి ఇక భజన చేయాల్సిందేనని భావించిన రాపాక.. ఈ రేంజ్‌లో జగన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారట. ఎలాగో ఎన్నికల సమయం దగ్గర పడటం, పైగా ఇంట్లో కార్యం కావడంతో ఇలా వెడ్డింగ్ కార్డు రూపంలో జగన్‌కు బిస్కట్లు వేస్తూ రాపాక ట్రిక్స్ ప్రదర్శిస్తున్నారని ట్రోలింగ్ మొదలైంది. ప్రస్తుతం రాజోలు నుంచి వైసీపీ తరఫున అభ్యర్థి అయితే ఎవరూ లేరు. గతంలో వైసీపీ తరఫున పోటీచేసిన బొంతు రాజేశ్వర రావు.. రాపాక రాకతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో పక్కాగా టికెట్ తనకే అని రాపాక అనుకుంటున్నారట. అందుకే ఇలా జగన్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని టాక్ నడుస్తోంది. అయితే.. రాపాక వైసీపీ తరఫున పోటీచేస్తే తప్పకుండా ఓడిస్తామని అటు వైసీపీ.. ఇటు జనసేన కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు జోస్యం చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే.. రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పట్నుంచే భక్తి చాటుకుంటున్న రాపాకను జగన్ ఏ మాత్రం అనుగ్రహిస్తాడో వేచి చూడాలి. ఈ రేంజ్‌లో జగన్నామం స్మరిస్తున్న రాపాకకు టికెట్ ఇచ్చే సంగతి దేవుడెరుగు.. ముందు కనీసం జూన్ 7న జరిగే పెళ్లికి అయినా ముఖ్యమంత్రి హాజరవుతారో చూడాలి మరి..!