DS For Telangana : తెలంగాణకు ‘డీకే’ వస్తున్నారో లేదో తేల్చి చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఈ ఒక్క ప్రకటనతో..
ABN , First Publish Date - 2023-06-18T17:29:11+05:30 IST
డీకే శివకుమార్.. (DK Shivakumar) పొట్టి అక్షరాల్లో డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీకి విజయం చేకూర్చడంలో ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు..
డీకే శివకుమార్.. (DK Shivakumar) పొట్టి అక్షరాల్లో డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీకి విజయం చేకూర్చడంలో ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకేకు.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించిందని గత కొన్నిరోజులుగా ఇటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కబెట్టడానికి డీకే ఇప్పటికే రంగంలోకి దిగేశారని.. పార్టీలో చేరికల నుంచి ట్రబుల్ షూటింగ్ వరకు అన్నీ ఇక ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రాకుండానే ఇదెలా సాధ్యం..? ఇందులో నిజమెంత..? డీకే నిజంగానే తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్‌గా వస్తున్నారా..? అనేదానిపై తెలంగాణ కీలక నేతలుగానీ.. ఢిల్లీ అగ్రనేతలుగానీ క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే ఇందులో నిజానిజాలేంటో ఏఐసీసీ సెక్రెటరీ మాణిక్‌రావు ఠాక్రే (AICC Secratary Manikrao Thakre) తేల్చి చెప్పేశారు.
ఇదీ అసలు కథ..
మాణిక్‌రావు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా చందనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా డీకే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. డీకే శివకుమార్ తెలంగాణకు రావట్లేదని.. ఆయన ఇన్‌చార్జ్‌గా వస్తున్నారనేది అవాస్తవని రూమర్స్‌ను కొట్టిపారేశారు. అయితే.. తెలంగాణలో డీకే ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో ఏఐసీసీ పెద్దలదే తుది నిర్ణయమన్నారు. అంతేకాదు.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి దేశంలో ఉన్న అందరూ కీలక నేతలు వచ్చి.. పనిచేస్తారన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా.. కుటుంబసభ్యుల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలు పార్టీల సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఠాక్రే తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు రహస్య మిత్రులని .. ఈ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మాణిక్‌రావు మండిపడ్డారు. ఈ రెండు పార్టీలో ఢిల్లీలో దోస్తీ చేస్తూ.. రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
డీకే పేరే తెరపైకి ఎందుకొచ్చింది..!?
దక్షిణాదిలో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో అఖండ విజయం సాధించడంతో కొత్త శక్తి వచ్చినట్లయ్యింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా.. బీఆర్‌ఎస్ పేరిట అటు జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించి హైదరాబాద్ వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ బహిరంగసభ విజయవంతం కావడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే విషయంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన డీకే శివకుమార్(DK Shivakumar) అటు పార్టీ అధిష్టానానికి కూడా అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం సిద్దరామయ్యతో కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా ఎన్నికలకు ముందు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, భారీ బహిరంగసభలు, గెలుపొందాక ముఖ్యమంత్రి పదవి కోసం పట్టు, ఆపై మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపు వంటి అన్నింటా డీకే శివకుమార్ ఓ అడుగు వెనకేసి పార్టీ కోసమే ముందుకెళ్లారు. వీటన్నింటికీ ప్రధాన కారణం దక్షిణాదిన మనుగడలేని కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ద్వారా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుపొందాలనేదే అధిష్టానం వ్యూహంగా ఉంది. డీకే రంగంలోకి దిగితే రాజకీయం, ఆర్థికం, అంశాల్లోనూ తిరుగులేకుండా ముందుకెళ్తారు. కర్ణాటకలో ప్రకటించిన గ్యారెంటీల వంటి పథకాలు తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వదలిచినట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
మొత్తానికి చూస్తే.. గత కొన్నిరోజులుగా డీకేపై వస్తున్న రూమర్స్‌కు ఠాక్రే చెక్ పెట్టేశారు. అయితే.. శివకుమార్ వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందని భావించిన నేతలు ఈ ప్రకటనతో ఒకింత ఢీలా పడిపోయారట. ఎన్నికలకు ఇంకా చాలానే టైమ్ ఉందిగా.. ఈలోపు ఏం జరుగుతుందో చూడాలి మరి.