Nellore: జగన్‌కు పుండు మీద కారం చల్లిన ఆనం.. లోకేశ్ పాదయాత్ర అలా ఎంటర్ అయిందో.. లేదో..!
ABN , First Publish Date - 2023-06-14T14:49:17+05:30 IST
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర అధికార వైసీపీకి శవయాత్రగా మారిందా..? గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో లోకేశ్ పాదయాత్రకు అనూహ్య స్పందన రావడం మార్పునకు సంకేతమా..? కడప జిల్లాలో ముగిసిన నారా లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయీ కావడంతోనే వైసీపీకి ఝలక్ తగిలిందా..?
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర అధికార వైసీపీకి శవయాత్రగా మారిందా..? గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో లోకేశ్ పాదయాత్రకు అనూహ్య స్పందన రావడం మార్పునకు సంకేతమా..? కడప జిల్లాలో ముగిసిన నారా లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయీ కావడంతోనే వైసీపీకి ఝలక్ తగిలిందా..? నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లోకేశ్ పాదయాత్ర నిర్వహణను భుజానికెత్తుకోవడం వైసీపీ అధినేత జగన్‌కు పుండుమీద కారం చల్లినట్టయిందా..? నెల్లూరు జిల్లాలో అప్రతిహతంగా, అశేష జనాదరణతో సాగుతున్న నారా లోకేశ్ పాదయాత్రకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్న తీరుపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు గానూ పదికి పది స్థానాలు వైసీపీ వశమయ్యాయి. వైసీపీ క్లీన్ స్వీప్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కానీ.. ఇప్పుడు అదే నెల్లూరు జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురిపై అధిష్టానం వేటేసింది. వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధినేత జగన్ కన్నెర్ర చేశారు. ఫలితంగా.. నెల్లూరు జిల్లాలో వైసీపీ బలం తగ్గిపోయింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లాలో వైసీపీ పతనమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ యువ నేత నారా లోకేశ్ తలపెట్టిన ‘యువ గళం’ పాదయాత్ర వైసీపీని మరింత డ్యామేజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ సర్కార్ అవినీతిని, అసమర్థతను, అభివృద్ధి రహిత పాలనను ప్రజలకు వివరిస్తూ అశేష జనాదరణ మధ్య లోకేశ్ పాదయాత్ర సాగుతోంది.
జూన్ 13, 2023న నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి నారా లోకేశ్ పాదయాత్ర ఎంటరైంది. యువనేతకు స్వాగతం పలుకుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో బ్యానర్లు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. అయితే.. ఆ బ్యానర్లలో, కటౌట్లను స్థానిక టీడీపీ నేతల కంటే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు, నారా లోకేశ్ పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలో జరిగినన్ని రోజులు నిర్వహణ వ్యయం అంతా ఈ మాజీ మంత్రిదేనని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. పత్రికల్లో నారా లోకేశ్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ పరిణామంతో వైసీపీ అధినేత జగన్‌కు పుండు మీద కారం చల్లినట్టయింది.
అసలే.. ఈ మధ్య జరిగిన పరిణామాల కారణంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. సొంత పార్టీలో కుమ్ములాటలతో నెల్లూరు జిల్లాలో వైసీపీ సతమతమవుతోంది. ఈ తరుణంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలోకి ఎంటర్ కావడం, ఈ పాదయాత్రకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతుండటంతో వైసీపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది. ఒక్క ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే కాదు మిగిలిన ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా నారా లోకేశ్‌కు వారివారి నియోజకవర్గాల్లో గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్న ఆశావహుల్లో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. ఆనం రామనారాయణరెడ్డి ఆ రేసులో ముందు వరుసలో ఉండేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నారో ‘యువగళం’ పాదయాత్ర నేపథ్యంలో ఆయన వైఖరితో స్పష్టంగా తేలిపోయింది.
ఏదేమైనా నెల్లూరు జిల్లాలో వైసీపీకి పరిస్థితులు గతంలో మాదిరిగా లేవని, టీడీపీ అనూహ్యంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు సిటీలో కూడా వైసీపీకి ఈసారి కష్టంగానే ఉండేలా పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరు సిటీలో బాబాయ్-అబ్బాయ్ అంతర్గత కుమ్ములాటలకు వైసీపీ ఇప్పటికే డ్యామేజ్ అయింది. జగన్ పిలిచి మాట్లాడినా మాజీ మంత్రి అనిల్, రూప్ కుమార్ యాదవ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ బాబాయ్-అబ్బాయ్ కుమ్ములాట మూలాన నెల్లూరు సిటీ వైసీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డట్టయింది. మొత్తంగా చూసుకుంటే.. నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన టీడీపీ యువ నేత నారా లోకేశ్ ‘యువ గళం’ పాదయాత్ర నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు తావిచ్చింది.