YS Jagan : ఎక్సర్‌సైజ్ చేస్తుండగా వైఎస్ జగన్ కాలికి గాయం.. ఆందోళనలో వైసీపీ శ్రేణులు.. సడన్‌గా ఒంటిమిట్ట పర్యటన రద్దు..
ABN , First Publish Date - 2023-04-04T20:39:59+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సడన్‌గా ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సడన్‌గా ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో బుధవారం నాడు జరిగే కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భావించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చేసింది. జగన్ వస్తున్నారని ఒంటిమిట్టలో భారీగానే ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. అయితే అనూహ్యంగా జగన్ పర్యటన రద్దు అయినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం పర్యటన ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందనే విషయాలపై ఆరాతీయగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత కొన్నిరోజులుగా సీఎం జగన్ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆ నొప్పి నుంచి కోలుకుంటుండగా.. మంగళవారం ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా మరోసారి జగన్ కాలు బెణికింది. మొదట సాధారణంగానే ఉన్న నొప్పి.. సాయంత్రం అయ్యే సరికి మరింత పెరిగింది. హుటాహుటిన సీఎం ఇంటికి వచ్చిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. చికిత్స అనంతరం ప్రయాణాలు రద్దుచేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అనూహ్యంగా సీఎం తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గతంలో ఇలానే జరగ్గా చాలా రోజులపాటు కాలినొప్పితో ముఖ్యమంత్రి బాధపడ్డారు. ఇప్పుడు తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో జగన్ కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జగన్ త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు, వీరాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.