AP Capitals : సిగ్గో.. సిగ్గు.. ఏపీ పరువు తీస్తున్న వైఎస్ జగన్.. కేవలం మూడేళ్లలో రాజధాని కడతామంటున్న BRS.. ఎంత కామెడీ అయిపోయిందో..!
ABN , First Publish Date - 2023-02-24T17:16:37+05:30 IST
ఏపీ రాజధాని (AP Capital) మారదు.. అమరావతిలోనే (Amaravati) ఉంటుంది.. మాటిస్తున్నా.. వైసీపీ (YSRCP) అధికారంలోకి రాగానే ఒక్క రాజధానినే కనివినీ ఎరుగని రీతిలో కడతాం.. ఇదీ 2019 ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) చెప్పిన మాట...
ఏపీ రాజధాని (AP Capital) మారదు.. అమరావతిలోనే (Amaravati) ఉంటుంది.. మాటిస్తున్నా.. వైసీపీ (YSRCP) అధికారంలోకి రాగానే ఒక్క రాజధానినే కనివినీ ఎరుగని రీతిలో కడతాం.. ఇదీ 2019 ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) చెప్పిన మాట. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జగన్ ఈ మాట మరిచిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రాజధానులు (Three Capitals) కడతామని ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఈయన మాటలతో ఆయన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఏపీ ప్రజలు విస్తుపోయారు. పోనీ మూడు రాజధానులకోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఇంతవరకూ ఒక్క ఇటుకా పడలేదు. అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తున్నారే తప్పితే ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో అసలు ఏపీ రాజధాని ఏదో కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. రాజధాని ఏదని ఎవరైనా అడిగితే కనీసం ఏపీ ప్రజలు కూడా ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇదీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఘనకార్యం.
పరువు పోయిందిగా..!
వైఎస్ జగన్ ఏపీ పరువును గంగలో కలపడంతో రాజధాని అనే మాట వస్తే నవ్వుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని వ్యవహారం కామెడీగా అయిపోయింది. దీనికి తోడు ఒక పద్ధతి, విధానం లేకుండా ఎవరు పడితే వాళ్లు రాజధాని గురించి రోజుకో స్టేట్మెంట్ ఇస్తుండటంతో వైఎస్ జగన్ తన పరువు తానే చేజేతులా తీసుకున్నట్టే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు తిరిగి.. ఇటు తిరిగి ఈ వ్యవహారం ఎంతవరకూ వచ్చిదంటే.. ఆఖరికి ఏపీలో పురుడుపోసుకోని పార్టీ సైతం జగన్‌ను, రాజధాని విషయాన్ని వేలెత్తి చూపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో అధ్యక్షుడుతో పాటు ఒకరిద్దరు తప్పితే నేతలే లేరు. కానీ ఆ పార్టీతో కూడా వైఎస్ జగన్ మాటలు పడుతున్నారంటే.. ఆయన విలువ ఎక్కడికి పడిపోయిందో అని సొంత పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయట.
మాకు మూడేళ్లు చాలు..!
ఏపీ బీఆర్ఎస్ (AP BRS) అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Sekhar) ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 3 నుంచి 4 ఏళ్లలోనే ప్రజలు కోరుకునే రాజధానిని నిర్మించి తీరుతామని ధీమాగా చెప్పారు. అంతేకాదు.. ఇప్పటికే ఈ విషయంపై ఓ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగేళ్లుగా ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శలు గుప్పించారు. దేశంలో రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని తోట వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు చేరబోతున్నారని కూడా చెప్పారాయన.
ఏం జరుగునో..!
చూశారుగా.. జగన్‌ను, ఆయన ప్రభుత్వంపై ఆఖరికి ఎవరెవరు ఎలాంటి మాటలు అంటున్నారో ఇదీ ఏపీలో ప్రస్తుతం పరిస్థితి. అసలు పురుడు పోసుకోని పార్టీనే మూడేళ్లు సమయం అడుగుతున్నదంటే.. జగన్‌ను నమ్మి ఎవరూ ఊహించని రీతిలో 151 సీట్లు ఇచ్చిన వైసీపీలో ఎలా ఉండాలి.. ఎంత ధీమాగా ఉండాలో వైసీపీకే తెలియాలి. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారంలో సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఫిబ్రవరి-23న విచారణకు రావాల్సి ఉండగా.. అది కాస్త వాయిదా పడింది. తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుంది..? అనే విషయంపై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ లేదు. రాజధానుల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది..? ఏపీ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా షాక్ తప్పదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
మొత్తానికి చూస్తే.. రానున్న ఎన్నికల్లో ఓట్ల అడగడానికి వెళ్లే వైసీపీకి రాజధానుల వ్యవహారం పెద్ద మైనస్ కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరోవైపు ప్రతిపక్షాలు, ఆఖరికి స్వపక్షం నుంచే రాజధానుల వ్యవహారంపై తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకత వస్తోంది. వైజాగ్, కర్నూలు, అమరావతి అనేవి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయే తప్ప ఇంతవరకూ అధికారికంగా ఏ ఒక్క అడుగూ ముందుపడిన దాఖలాల్లేవ్. జగన్‌ను ఎవరు ఏమనుకుంటున్నారే విషయం పక్కనెడితే రాజధాని వ్యవహారం మాత్రం అందరికీ పెద్ద కామెడీ అయిపోయింది. ఏపీలో ఈ పరిస్థితులు చక్కబడతాయో ఏంటో మరి.