Election Survey: సంచలన సర్వే.. వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీ-జనసేన కూటమిదే అధికారం!!
ABN , First Publish Date - 2023-10-03T16:38:32+05:30 IST
గత ఎన్నికల్లో 100 శాతం నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది.
వైనాట్ 175 అని డాంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఫేక్ సర్వేలతో మసిపూసి మారేడు కాయ చేస్తున్న జగన్‌కు అసలు సిసలైన సర్వే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గత ఎన్నికల్లో 100 శాతం నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది. హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో శాంపిళ్లు సేకరించి సర్వే నిర్వహించింది. ఈ మేరకు ఆత్మసాక్షి సర్వే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆత్మసాక్షి సర్వే మూడు నాలుగు రకాలుగా నిర్వహించింది. టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. అన్న ప్రాతిపాదికన ఆత్మసాక్షి సర్వే వివరాలను ప్రకటించింది. ఆప్షన్-1 ప్రకారం టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. టీడీపీకి 86, వైసీపీకి 68, జనసేనకు 6 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 15 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని.. అయితే వీటిలో వైసీపీ 9, టీడీపీ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఆప్షన్-2 ప్రకారం టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని.. అప్పుడు వైసీపీ 60 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.
ఆప్షన్-3 ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 70-75 సీట్లు మాత్రమే వస్తాయని.. వైసీపీకి 98-100 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని అంచనా వేసింది.
ఆప్షన్-4 ప్రకారం టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. వీరి కూటమికి 115-122 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీ 56-58 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది. 4 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది.
కాగా 2019 ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అక్షరాలా 95 శాతం నిజమైంది. వైసీపీ 139-142 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. టీడీపీ 22-28 స్థానాలకు పరిమితం అవుతుందని, జనసేనకు 0-2 సీట్లు మాత్రమే వస్తాయని గతంలో సర్వేలో వెల్లడించింది. వాస్తవ ఫలితాల ప్రకారం వైసీపీకి 151, టీడీపీకి 23 సీట్లు రాగా జనసేన ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది.