Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!
ABN , First Publish Date - 2023-09-14T16:47:53+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ (NCBN Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయ్..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ (NCBN Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయ్. రానున్న ఎన్నికల్లో టీడీపీతో (TDP-Janasena) కలిసే పోటీచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) తేల్చి చెప్పేశారు. టీడీపీ-జనసేన కలయికతో 2014 ఎన్నికలు రిపీట్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు, ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో అధికార వైసీపీ (YSR Congress) ఆలోచనలో పడింది. ఈ పొత్తులతో అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ పెద్దల్లో భయాందోళన మొదలైందట. అందుకే ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి.. ఏం మాట్లాడాలో తెలియక, ఇష్టానుసారం వాగేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) మీడియా మీట్ నిర్వహించారు.
ఇక కాస్కోండి..
చంద్రబాబుతో ములాఖత్ తర్వాత బాలయ్య మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆగ్రహంతో రగిలిపోతూ మాట్లాడారు. ‘ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే. ఈ అక్రమ కేసులకు భయపడాల్సింది మేము కాదు.. వైసీపీ నేతలే. మేము బలహీనపడుతున్నాం అని వైసీపీ అనుకుంటోంది కానీ.. ఇంకా బలపడుతున్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసమే యుద్ధం ప్రకటించాం. మళ్లీ చెబుతున్నా.. ఏపీ ప్రజల కోసం యుద్ధం చేస్తాం. పవన్ కళ్యాణ్ కూడా ఈ యుద్ధంలో కలవటం శుభపరిణామం. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. మసిపూసి మారేడు చేయాలని వైసీపీ చూస్తోంది. తప్పు చేయని వాడు దేవుడికి కూడా భయపడడు. తప్పు చేసిన వారంతా బయట ఉంటే, రాష్ట్రం బాగు కోసం పనిచేసిన చంద్రబాబు జైలులో ఉన్నారు. మేం భయపడే రకం కాదు.. న్యాయపరంగానే అన్నీ ఎదుర్కొంటాం. జగన్ ముఖ్యమంత్రి (YS Jagan) కావటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం’ అని బాలయ్య చెప్పారు.
ఇంత ఘోరమా..?
‘ఏపీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నైతికంగా మమ్మల్ని దెబ్బతీసినా.. మరింత బలంగా అవుతాం. ఇలాంటి ఘోరం దేశంలో ఎక్కడా జరగలేదు. దేశ ప్రజలంతా చంద్రబాబుకు సానుభూతి తెలిపారు. ఎన్నికలకు ముందే యుద్ధం ప్రారంభించాలి’ అని బాలకృష్ణ ప్రకటించారు. మరోవైపు.. టీడీపీ-జనసేన పొత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ భవిష్యత్ బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పేశారు. చంద్రబాబుపై బీజేపీ కుట్ర ఉంటుందని తాను నమ్మడం లేదన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. సేనాని మీడియా మీట్ తర్వాత బాలయ్య మాట్లాడుతూ ఇక యుద్ధమే అని ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.