TS Assembly Polls : ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఒకేసారి ఐదుగురు రాజీనామా!
ABN , First Publish Date - 2023-10-23T14:13:42+05:30 IST
అవును.. తెలంగాణలో ఎన్నికలకు (TS Assembly Polls) ముందు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్(BRS) కు అడుగడుగునా ఊహించని షాక్‌లే తగులుతున్నాయి...
అవును.. తెలంగాణలో ఎన్నికలకు (TS Assembly Polls) ముందు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్(BRS) కు అడుగడుగునా ఊహించని షాక్‌లే తగులుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం నుంచే ‘కారు’ దిగి కాంగ్రెస్‌లో (Congress) చేరికలు మొదలయ్యాయి. ముఖ్యనేతలు, కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి హస్తం గూటికి చేరిపోతున్నారు. కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో (Ponguleti Srinivasa Reddy) మొదలైన చేరికలు.. ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ వందల సంఖ్యలో నేతలు పార్టీలోకి వచ్చి చేరిపోయారు. ఈ చేరికలతో అసలు ఒకట్రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యిందని రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి. ఇందులో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా మొదటిదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) లాంటి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఒకరిద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఒకేసారి ఐదుగురు..!
ఇక అసలు విషయానికొస్తే.. జయశంకర్ భూపాలపల్లిలో (Jayashankar Bhupalpally) బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి ఐదుగురు కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ వేదికగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కురిమిల్ల రజిత - శ్రీనివాస్, చల్లూరి మమత - కమలాకర్, ముంజాల రవి గౌడ్, చల్ల రేణుక - రాములు, తొట్ల సంపత్‌తో పాటు టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మండ సంపత్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ నేతల చేరికలో గండ్ర సత్యనారాయణ కీలకపాత్ర పోషించారు. ఈ ఆరుగురు నేతలతో మంతనాలు జరిపి.. భూపాలపల్లి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి కండువాలు కప్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భూపాలపల్లిలో గండ్ర సత్తన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కౌన్సిలర్లకు రేవంత్ రెడ్డి సూచించారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆ ఐదుగురు నేతలు.. రేవంత్‌కు మాటిచ్చారు.