Pawan Kalyan: పవన్ విషయంలో బీజేపీ వైఖరి మారిందా? కారణాలు ఇవేనా?
ABN , First Publish Date - 2023-07-18T12:16:56+05:30 IST
పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం సినిమాల్లో పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆహ్వానించింది. మరోవైపు ఇన్ని రోజులు తనను పట్టించుకోకుండా ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పిలవగానే వెళ్లాలా వద్దా అని ఆలోచించి చివరికి పవన్ పెద్దవాళ్లు పిలిచినప్పుడు వెళ్లడమే సంప్రదాయం అని భావించారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను చేపట్టిన వారాహి యాత్ర (Vaarahi Yatra) సందర్భంగా అధికార పార్టీ ఆగడాలను వరుసగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కొందరు వాలంటీర్లు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని.. ఉమెన్ ట్రాఫికింగ్ (Women Trafficking) చేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. అయితే జనసేనతో అధికారికంగా బీజేపీ (BJP) పొత్తులో ఉన్నా పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా ఆ పార్టీ నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైకి మిత్రపక్షాలుగా చెప్పుకుంటున్నా జనసేన, బీజేపీ (Janasena-BJP Alliance) మధ్య బంధం అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వంపై పోరాటాల విషయంలోనూ ఎక్కడా రెండు పార్టీలు కలిసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎన్డీయే (NDA) సమావేశానికి పవన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా పవన్‌ను పెద్దగా పట్టించుకోని బీజేపీ ప్రస్తుతం ఆయన్ను పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండటంతో బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. జనసేనతో పొత్తు కేవలం ఏపీకే పరిమితం అనేలా బీజేపీ నేతలు ప్రవర్తించారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్‌ను ప్రచారానికి ఉపయోగించుకోవడానికి బీజేపీ నేతలు నిరాకరించారు. పవన్‌తో పొత్తు ఏపీలో మాత్రమే అని.. తెలంగాణలో పార్టీకి ఆయన అసవరం లేదని అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయవద్దని బీజేపీ నేతలు పవన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ నేతల తీరు కారణంగానే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్దికి మద్దతు ఇస్తున్నట్లుగా గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం సినిమాల్లో పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆహ్వానించింది. మరోవైపు ఇన్ని రోజులు తనను పట్టించుకోకుండా ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పిలవగానే వెళ్లాలా వద్దా అని ఆలోచించి చివరికి పవన్ పెద్దవాళ్లు పిలిచినప్పుడు వెళ్లడమే సంప్రదాయం అని భావించారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత… పార్టీగా గుర్తించిన సందర్భాలు తక్కువ. ఎనిమిదేళ్ల వరకూ మోదీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటం.. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని పదే పదే బీజేపీ నేతలు చెప్పుకోవడం కూడా ఎన్డీఏ సమావేశానికి పవన్‌ను ఆహ్వానించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ను బీజేపీ అవసరానికే వాడుకుంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.
ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నంగా కనబడుతోంది. అయితే బీజేపీ పిలవగానే పవన్ కూడా ఢిల్లీకి వెళ్లడంపై కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలిసి బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే అంశంపై మాట్లాడేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్లకపోతే వైసీపీకి మేలు చేయడంతో పాటు బీజేపీ-జనసేన తీవ్రంగా నష్టపోతాయని బీజేపీ పెద్దలకు పవన్ వివరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి: