Rajyasabha : తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతను రాజ్యసభకు తీసుకుంటున్న బీజేపీ.. ఆ ‘తెలుగోడు’ ఎవరంటే..!?
ABN , First Publish Date - 2023-07-10T16:25:55+05:30 IST
సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు...
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పట్టు పెంచుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలు (JP Nadda) వరుస పర్యటనలు, బహిరంగ సభలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో (Telangana) , వచ్చే ఏడాది ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించిన బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిని రాజ్యసభకు తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి గత మూడ్రోజులుగా అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు (Telugu Leader) రాజ్యసభ సీటు ఇవ్వవచ్చంటూ ఊహాగానాలు ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరో ఒక్కరు అని చర్చ నడవగా.. ఇప్పుడు దాదాపు కన్ఫామ్ అయ్యినట్లేనని తెలుస్తోంది.
ఇంతకీ ఆయనెవరంటే..?
తెలంగాణలో (Telangana) అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఈ క్రమంలో రాష్ట్రం నుంచే ఒకరిని రాజ్యసభకు తీసుకోవాలని భావించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి గరికపాటి మోహన్ రావును (Garikapati Mohan Rao) రాజ్యసభకు తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈయనకు పదవి ఇవ్వడం వల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు భరోసా కల్పించేందుకు బాగుంటుందని అధిష్ఠానం ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. టీడీపీలో (Telugudesam) కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన ఈయన బీజేపీలో చేరి చాలారోజులు అవుతున్నా ఇంతవరకూ ఈయనకు పదవి ఇవ్వలేదు.. దీంతో అసంతృప్తితో ఉన్నారు. ఇంతకాలం వేచి ఉన్న గరికపాటి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న గరికపాటి (Garikapati) అనుచరులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గరికపాటి 2014 నుంచి 2020 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం ఈయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.
బీజేపీ ప్లాన్ ఇదీ..?
కాగా.. గుజరాత్ నుంచి ముగ్గురు, బెంగాల్ నుంచి ఆరుగురు, గోవా నుంచి ఒకరు.. ఇలా అన్నీ కలిపి మొత్తం రాజ్యసభలో 10 స్థానాలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు జూలై-13 చివరి తేదీ. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 5 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే.. తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పట్లో రాజ్యసభకు కూడా ఇక్కడ్నుంచే తీసుకునే ఛాన్స్ లేదని అనుకున్నప్పటికీ.. చివరికి ఇటువైపే అగ్రనాయకత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. ఇప్పుడు అధికార బీఆర్ఎస్ నుంచి బయటికి రావాలనుకునేవారంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు బీజేపీ నుంచే బయటికి వెళ్లాలని కొందరు అనుకుంటున్నారే తప్ప.. పార్టీలోకి రావాలనుకునే వారు అస్సలే లేరు. అందుకే.. వేరే పార్టీ నుంచి కాషాయ కండువా కప్పుకున్నవారికి ప్రాధాన్యత కల్పిస్తే భరోసా ఇచ్చినట్లు ఉంటుందని గరికపాటిని రాజ్యసభకు తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.