Telangana Politics: తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి... ఏ కులానికో?
ABN , First Publish Date - 2023-01-07T18:57:24+05:30 IST
తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ... తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) కులాల చుట్టూ తిరగవు.. ఇది గతంలో ఎక్కువగా వినపడే మాట. కానీ, సెంటిమెంట్ రాజకీయాలు ఎక్కువై పోయే సరికి..
తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ... తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) కులాల చుట్టూ తిరగవు... ఇది గతంలో ఎక్కువగా వినపడే మాట. కానీ, సెంటిమెంట్ రాజకీయాలు ఎక్కువై పోయే సరికి విరుగుడుగా ఇప్పుడు కులాలు ఎంటరైపోతున్నాయి. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ (BRS) అయినా, ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలైనా కులాలను (Caste Equations) లెక్కేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో బీజేపీ (BJP) కూడా అధికారం కోసం లెక్కలు కడుతూ... కొత్త అంచనాలను మొదలుపెట్టింది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Center Ministry Cabinet Expansion) జరగబోతుంది. సంక్రాంతి (Sankranti) తర్వాత మోడీ ఎలక్షన్ క్యాబినెట్ రెడీ అవుతుంది.
అందులో తెలంగాణ నుండి మరొకరికి ఛాన్స్ దక్కుతుందని, ఇప్పుడున్న కిషన్ రెడ్డికి (Kishan Reddy) తోడు మరొకరు రాబోతున్నట్లుగా బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. కిషన్ రెడ్డి ఇప్పటికే మంత్రి అయ్యారు. మిగిలిన వారిలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్ లు మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మరో ఎంపీ సోయం బాపురావు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇందులో బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. బీజేపీలో జోడు పదవులు ఉండవు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా...? లేక అధ్యక్ష పదవిని బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలకు అప్పజెప్పుతారా...? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓ వర్గం మద్దతు ఉందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో... మున్నురు కాపు వర్గాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు బండి సంజయ్‌ను అధ్యక్షుడిగానే ఉంచి ఎంపీ అరవింద్‌కు అవకాశం ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. పైగా ఇదే వర్గం నుండి యూపీ కోటాలో ఎన్నికైన ఎంపీ లక్ష్మణ్ కూడా ఉన్నారు. అసలు ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చిందే తెలంగాణ కోటా కింద అన్న చర్చ కూడా అప్పట్లో జోరుగా సాగింది. సో... ఎలా చూసినా, బీజేపీ ఎవరికి అవకాశం ఇచ్చినా కుల ప్రాతిపదికనే అన్నది మాత్రం కామన్ పాయింట్ అంటున్నారు విశ్లేషకులు.