NCBN Arrest : ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసు వాహనాలు.. అసలేం జరుగుతోంది..?
ABN , First Publish Date - 2023-09-10T11:30:28+05:30 IST
వాడివేడిగానే ఇరువర్గాల వాదనలు జరుగుతున్నాయి. అయితే.. అటు వాదనలు కొనసాగుతుండగానే ఏసీబీ కోర్టు ప్రాంతంలో వాతావరణం మొత్తం మారిపోయింది!. కోర్టు వద్ద భారీగా వాహనాలు సిద్ధంగా ఉన్నాయి..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో (ACB) హోరాహోరీగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు ప్రారంభించారు. వాడివేడిగానే ఇరువర్గాల వాదనలు జరుగుతున్నాయి. అయితే.. అటు వాదనలు కొనసాగుతుండగానే ఏసీబీ కోర్టు ప్రాంతంలో వాతావరణం మొత్తం మారిపోయింది!. కోర్టు వద్ద భారీగా వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో పోలీసులు ఉండగా.. మరికొంత మంది అక్కడికి చేరుకుంటున్నారు. భారీగానే పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశామని పోలీసులు చెబుతున్నారు. అక్కడున్న కాన్వాయ్, పోలీసులు భారీగా మోహరించడాన్ని చూస్తే ఏదో కీలక పరిణామమే జరగబోతోందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
రాజమండ్రికి తరలిస్తారా..?
చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరనున్నారు. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry Central Jail) బాబును తరలించే అవకాశం ఉంది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు తదుపరి చర్యలకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ముందస్తుగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విజయవాడ కోర్టు హాలు నుంచీ రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు పలు రకాల దారులను క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు, కాన్వాయ్ ఉండగా మరిన్ని బలగాల వాహనాలను ఉన్నతాధికారులు రప్పిస్తున్నారు. కోర్టు లోపల వాదోపవాదాలు.. కోర్టు బయట పరిస్థితితో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి.
కన్నెర్రజేసిన టీడీపీ శ్రేణులు!
విజయవాడ కోర్టు వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నాయకుల్ని, శ్రేణుల్ని ఎక్కడ ఎక్కడ అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై కన్నెర్రజేస్తున్నారు. కోర్టుకు అర కిలోమీటరు దూరంలో రోడ్డుకు అడ్డంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో వాహనాదారులు, కోర్టుకు వచ్చే కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ ముఖ్యనేతలు కోర్టుకు చేరుకున్నారు. వందల సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కోర్టు ప్రాంతంలో చంద్రబాబు ఎప్పుడెప్పుడు బయటికొస్తారా..? అని వేచి చూస్తున్నారు. అయితే.. మధ్యాహ్నం 2 గంటల వరకూ కోర్టులో వాదనలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.