CM KCR: ఆ జిల్లా పర్యటనలో సీఎం చిటపటలు, రుసరుసల మధ్య సాగిన టూర్..

ABN , First Publish Date - 2023-03-27T13:32:57+05:30 IST

ఇటీవల ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుడిగాలి పర్యటన..

CM KCR: ఆ జిల్లా పర్యటనలో సీఎం చిటపటలు, రుసరుసల మధ్య సాగిన టూర్..

ఇటీవల ఆ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్...రొటీన్‌కు భిన్నంగా వ్యవహరించారు. అకాలవర్షాలు, వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టాన్ని చూసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. పలువురు సొంత పార్టీ నాయకులపై చిటపటలాడారు. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రి పర్యటనకే డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-188.jpg

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు చోట్ల పర్యటన

ఇటీవల ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుడిగాలి పర్యటన చేశారు. అకాలవర్షాలు, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు చోట్ల పర్యటించారు. మొదట మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు వచ్చారు. దగ్గరల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన కేసీఆర్‌.... కిలోమీటర్ దూరంలో ఉన్న పొలాల దగ్గరకు వెళ్లారు. వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, మిర్చి పంటలను పరిశీలించారు. ఈదురుగాలులు, వడగండ్ల వానతో దెబ్బతిన్న మామిడి తోటలను చూశారు. అయితే అక్కడ పంటనష్టం పెద్దగా లేదు. దీంతో దెబ్బతిన్న పంటలు చూపించలేదని అధికారులపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

Untitled-218.jpg

నాయకులపై చిటపటలాడిన సీఎం

మామిడితోట బీఆర్‌ఎస్‌కు చెందిన రైతుది కావడం...పైగా తోట ఎవరిదని కేసీఆర్‌ అడిగినప్పుడు...ఖద్దరు బట్టలు వేసుకున్న నేత ప్రత్యక్షమై ఇది తనతోటే అని చెప్పారు...ఆయన అవతారం చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే రెడ్డికుంటతండాలో సీఎం ఆగి మాట్లాడడం షెడ్యూల్లో లేదు...దీంతో అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చేందుకు సీఎం ఇష్టపడలేదు...ఖమ్మంలో మాట్లాడాము కదా....ఇక్కడ అవసరం లేదని...మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో అన్నారు సీఎం...కానీ మంత్రి దయాకరరావు ప్లీజ్ సార్ అని...పదే పదే రిక్వెస్ట్ చేయడంతో... కాదన లేక సీఎం వేదికపైకి వచ్చి మాట్లాడారు. అయితే కేసీఆర్ స్పీచ్ రొటీన్‌కు భిన్నంగా సాగింది. బొంగురు గొంతుకు తోడు...మైకు సరిగా పనిచేయకపోవడంతో....పక్కనే ఉన్న మంత్రి ఎర్రబెల్లి భుజంపై కొట్టారు. అలాగే ఆయన చేతిలో ఉన్న మైకు లాక్కుని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటికే అనుకున్న షెడ్యూల్ ఆలస్యం కావడం...లంచ్ టైమ్ దాటిపోవడంతో నాయకులపై సీఎం చిటపటలాడారు. అది సీఎం కేసీఆర్‌ హావబావాల్లో స్పష్టంగా కనిపించింది.

Untitled-20544.jpg

ఏర్పాట్లు చేయలేకపోయిన అధికారులు

రెడ్డికుంటతండాలో పర్యటన ముగిసిన వెంటనే... కేసీఆర్‌ బస్సులోనే లంచ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...ముఖ్యమంత్రికి వడ్డించారు. సహజంగా సీఎం పర్యటనలో అధికారులు సీఎం లంచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అయితే ముఖ్యమంత్రి ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను ఓపెన్‌ చేసి బస్సులోనే తిన్నారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ పర్యటన 12గంటల ముందే ఖరారు కావడంతో... ఏర్పాట్లు చేయడంలో అధికారులకు, నేతలకు ఇబ్బందులు ఎదురైనట్టు స్థానిక నాయకులు చెప్పారు.

Untitled-22457.jpg

కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు పోటీపడ్డ నాయకులు

మహబూబాబాద్ జిల్లా రెడ్డికుంటతండాలో పర్యటన ముగించుకున్న తర్వాత వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. సీఎం పర్యటకు వచ్చిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం దృష్టిలో పడేందుకు పోటీపడ్డారు. నాయకుల హడావుడిని చూసి...సీఎం అసహనానికి లోనయ్యారట. ఇక పంట నష్టపోయిన రైతుల కష్టాలను తెలుసుకునేందుకు సీఎం వస్తే...నాయకులు మాత్రం రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు చేసిన హంగామాపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Untitled-23744.jpg

చిటపటలు, రుసరుసల మధ్య సాగిన కేసీఆర్‌ పర్యటన

మాములుగా ఏ జిల్లాలోనైనా ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సమయంలో....జిల్లాకు సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు హాజరు అవుతారు. కానీ ఈసారి సీఎం టూర్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి వరగంల్‌ జిల్లా పర్యటనకు కేసీఆర్‌ వచ్చారు. దేశంలో కొత్త వ్యవసాయ విధానం అమల్లోకి రావాలన్నది బీఆర్‌ఎస్‌ విధానమని, తద్వారా పంట నష్టం జరిగితే రైతులు బీమా పాలసీ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్ ఎక్కడ ప్రసంగించినా జై భారత్ అని నినదించేవారు. కానీ నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో మాత్రం జై తెలంగాణ అని నినదించారు.

Untitled-1954.jpg

పూర్తిగా రాష్ట్రం నిధుల నుంచే పంట పరిహారం అందిస్తామని, కేంద్రాన్ని ఏకాణా కూడా అడగదల్చుకోలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే గతంలో ఉన్న అలవాటు ప్రకారం కేసీఆర్‌ జై తెలంగాణ అని నినదించారని సొంత పార్టీ నాయకులు చర్చించుకున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చిటపటలు, రుసరుసల మధ్యే సాగింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ముఖ్యమంత్రి అసహనానికి కారణమైని బీఆర్‌ఎస్‌ నేతలు సర్దిచెప్పుకోవడం వినిపించింది.

Updated Date - 2023-03-27T13:32:57+05:30 IST