Akhilesh Yadav: అఖిలేశ్ అడుగులు ఎటు..? ఇటేమో కేసీఆర్‌తో దోస్తీ.. మళ్లీ అటేమో..!
ABN , First Publish Date - 2023-07-03T17:54:19+05:30 IST
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ రాజకీయంగా ఎటు వైపుగా అడుగులేస్తోందో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వైఖరే అందుకు కారణం. అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా అనుసరిస్తున్న వ్యూహం ఏంటో అంతుచిక్కని పరిస్థితి.
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కంటూ ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం కావడంతో పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన ప్రతిసారీ యూపీ చుట్టే రాజకీయంగా చర్చ జరుగుతుంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ రాజకీయంగా ఎటు వైపుగా అడుగులేస్తోందో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వైఖరే అందుకు కారణం. అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా అనుసరిస్తున్న వ్యూహం ఏంటో అంతుచిక్కని పరిస్థితి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌కు వెళ్లి మరీ కలిశారు.
మర్యాదపూర్వక భేటీగా బీఆర్‌ఎస్, ఎస్పీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఇది పూర్తిగా రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగిన సమావేశంగా తెలుస్తోంది. అయితే.. ఈ సందర్భంగా కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్న ఒక విషయాన్ని గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీ బీఆర్‌ఎస్ అని ఆది నుంచి కేసీఆర్ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. తాము ఎవ్వరికీ బీ-టీం కాదని చాలా గట్టిగానే బీఆర్‌ఎస్ అధిష్ఠానం బదులిస్తోంది. అలాంటి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో అఖిలేశ్ యాదవ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తెలంగాణలో దూకుడుగా ముందుకెళుతోంది. జాతీయ స్థాయిలో కూడా బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ప్రత్యర్థిగానే చూస్తోంది తప్ప బీజేపీయేతర పార్టీగా భావించడం లేదు. అలాంటి బీఆర్‌ఎస్‌తో సమాజ్‌వాదీ దోస్తీ దిశగా అడుగులేస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ముందుకెళుతున్న ప్రతిపక్ష పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ కూడా ఒకటి. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నడుం కట్టిన బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఇటీవల పట్నాలో విపక్షాల సమావేశం ‘మిషన్ 2024’ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా పాలుపంచుకున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిలను ఈ భేటీకి ఆహ్వానించలేదు. తెలంగాణలో కాంగ్రెసే తమ ప్రధాన ప్రత్యర్థి అయినందున ఆ పార్టీతో చేతులు కలిపేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే విపక్ష కూటమిలో చేరేది లేదని మాయావతి స్పష్టం చేశారు. ఇలా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండే రాజకీయ పార్టీల్లో ఒక్క సమాజ్‌వాదీ పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ దాదాపుగా ఒక క్లారిటీతో ఉన్నాయి.
అఖిలేశ్ ఇటు బీఆర్‌ఎస్‌తోనూ, అటు కాంగ్రెస్‌తోనూ స్నేహ రాగం ఆలపిస్తుండటంతో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహమేంటో అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌తో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కలిసొస్తుందో ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో చేరికలు గానీ, పార్టీ విస్తరణ గానీ జరగలేదు. కేసీఆర్ పనిగట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ పక్షాలకు చెందిన నేతలను పలుమార్లు కలిసినప్పటికీ మర్యాద చేశారే తప్ప బీఆర్‌ఎస్‌కు బాహాటంగా మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీ లేదని చెప్పక తప్పదు. దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ అంత చెప్పుకోతగిన స్థానంలో లేనప్పటికీ కేసీఆర్‌తో రాజకీయ చర్చలకు అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మరీ కలవడం.. దేశంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన బీఆర్‌ఎస్ అధినేతతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.