Kavitha: సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో గుండెల్లోని ఆవేదనను ఏకరవు పెట్టిన కవిత..!

ABN , First Publish Date - 2023-03-15T16:33:04+05:30 IST

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ విచారణను ఎదుర్కొంటున్న..

Kavitha: సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో గుండెల్లోని ఆవేదనను ఏకరవు పెట్టిన కవిత..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కుమార్తె కవిత (BRS MLC Kavitha) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌లో కొన్ని కీలక విషయాలను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి కవిత తీసుకెళ్లారు. తన మనసులోని బాధనంతా పిటిషన్‌లో ఏకరవు పెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని, తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటి) చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో సుప్రీంను కవిత కోరారు.

కేంద్రంలోని అధికార పార్టీ ఆదేశాల మేరకు ఈడీ తనను వేధిస్తోందని, తన విషయంలో ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని ఆమె పిటిషన్‌లో వివరించారు. ఈ కేసు ఎఫ్‌ఐ‌ఆర్‌లో తన పేరు ఎక్కడ లేదని, కొద్ది మంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించారని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. అరుణ్ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని, ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడమే ఇందుకు ఒక నిదర్శనమని ఆమె తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలకు విశ్వసనీయత లేదని, ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని కవిత సంచలన ఆరోపణ చేశారు. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనమని (శరత్ చంద్రరెడ్డి మెనేజర్) ఆమె ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

ఈడీ అధికారులు తన ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారని, చట్ట విరుద్ధంగా తన ఫోన్ సీజ్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ సీజ్ చేసిన సమయంలో తన వివరణ తీసుకోలేదని, ఎవరితో కలిపి ఎదురెదురుగా విచారణ జరపలేదని తెలిపారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత 8:30 వరకు విచారించారని ఆమె మార్చి 11న ఈడీ విచారణ గురించి కోర్టుకు వివరించారు. భౌతికంగా, మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నానని.. తన నివాసంలోనే విచారణ జరపాలని, లేదంటే ఇతర నిందితులతో కలిపి జరిపి విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని కవిత సుప్రీంను అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌పై సుప్రీం స్పందిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో గురువారం ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సి ఉంది.

బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ మార్చి 11న విచారణకు హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె బయోమెట్రిక్‌, ఐరిస్‌ వివరాలను సిబ్బంది సేకరించారు. సాయంత్రం 4 గంటల వేళ విచారణకు విరామం ఇచ్చి ఈడీ క్యాంటీన్‌లో ఫలహారం తీసుకునేందుకు అనుమతించారు. ఆ తర్వాత మళ్లీ విచారణ కొనసాగించారు. రాత్రి 8గంటల సమయంలో విచారణ ముగిసిన తర్వాత కవిత నేరుగా సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసానికి వెళ్లిపోయారు.

20230315_135553.jpg20230315_135555.jpg

Updated Date - 2023-03-15T16:40:13+05:30 IST