TS Politics: బాల్క సుమన్ వ్యాఖ్యలు నిజమేనా? కాంగ్రెస్‌లో BRS కోవర్టులు ఎవరు?
ABN , First Publish Date - 2023-08-28T18:04:22+05:30 IST
కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనోళ్లేనని.. వాళ్లను ఏమనొద్దని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బాల్క సుమన్ సూచించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలం పుంజుకుంటున్న వేళ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఒకవేళ నిజమైతే ఆ కోవర్టులు ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనోళ్లేనని.. వాళ్లను ఏమనొద్దని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బాల్క సుమన్ సూచించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలం పుంజుకుంటున్న వేళ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై హస్తం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పక్కా డ్రామా అని.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలపై చేస్తున్న కుట్ర అని మండిపడుతున్నారు.
అసలు ఏం జరిగింది?
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ 116 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ బీఆర్‌ఎస్ టికెట్‌ను బాల్క సుమన్‌కు మరోసారి కేటాయించింది. టికెట్ ప్రకటించిన తర్వాత బాల్క సుమన్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. జైపూర్ మండలం నుంచి చెన్నూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజవర్గ ప్రజలను ఉద్దేశించి బాల్క సుమన్ మాట్లాడారు. కాంగ్రెసోళ్లు మనోళ్లేనని.. వాళ్లని ఏమనొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కొంతమందిని తామే కాంగ్రెస్ పార్టీలోకి పంపామని.. ఎన్నికలు పూర్తయ్యాక అందరూ మన దగ్గరకే వస్తారని కామెంట్ చేశారు.
ఆ కోవర్టులు ఎవరు?
నిజంగా బాల్క సుమన్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇటీవల కొన్నిరోజులుగా చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నుంచి మొదలుపెడితే రేఖానాయక్ వరకు ఈ జాబితాలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఈ లెక్కన తమ పార్టీలోని కొంతమందిని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ కోవర్టులు ఎవరు అంటూ కాంగ్రెస్ నేతలు ఆలోచనలో పడ్డారు. అయితే ఇదంతా కేసీఆర్ డ్రామా అని కాంగ్రెస్ సీనియర్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో కోవర్టులెవరూ లేరని, బీఆర్ఎస్ లీడర్లను తానే పంపించినట్లు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడుతున్న బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీలో తమ కోవర్టులు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, ప్రజలను తప్పుదోవపట్టించే కుట్రలో భాగంగా కోవర్టు డ్రామాల ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో స్థానికేతరుడైన బాల్క సుమన్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ లీడర్లే సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేత నూకల రమేష్, పీసీసీ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.