BRSలో చిచ్చు..అసమ్మతి కౌన్సిలర్ల తీరుపై అధిష్టానం కన్నెర్ర..అసలు ఏం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2023-02-16T12:20:49+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు.. సొంత పార్టీ చైర్మన్లపై అవిశ్వాసాలతో కాలుదువ్వుతున్నారు. ఆయా విషయాల్లో...

BRSలో చిచ్చు..అసమ్మతి కౌన్సిలర్ల తీరుపై అధిష్టానం కన్నెర్ర..అసలు ఏం జరుగుతోంది..!?

మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు బీఆర్ఎస్‌లో చిచ్చు పెడుతున్నాయా?.. కేసీఆర్ సొంత ఇలాకాలోనూ మున్సిపల్‌ చిచ్చు రాజుకుందా?.. అసమ్మతి కౌన్సిలర్ల తీరుపై అధిష్టానం కన్నేసిందా?.. పెద్దల ఆదేశాలనూ పట్టించుకోని కౌన్సిలర్లు.. సంచలన ఆరోపణలు చేస్తున్నారా?.. ఇంతకీ.. గజ్వేల్‌ మున్సిపాలిటీలో చిచ్చు ఎందుకు రాజుకుంది?.. అసమ్మతి కౌన్సిలర్లపై బీఆర్ఎస్‌ పెద్దలు ఎలాంటి ఫోకస్‌ పెట్టారు?.. లేదా అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-190525.jpg

గజ్వేల్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస నోటీసు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు.. సొంత పార్టీ చైర్మన్లపై అవిశ్వాసాలతో కాలుదువ్వుతున్నారు. ఆయా విషయాల్లో అధిష్టానం ఆదేశాలనూ భేఖాతార్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న చేర్యాల మున్సిపాలిటిలో కౌన్సిలర్లు అవిశ్వాసానికి నోటీసులిస్తే, నేడు ఏకంగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ మున్సిపల్ చైర్మన్‌పై కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇవ్వడం సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ తీర్మానం ప్రకారం నిర్ణీత గడువు వరకు అధికారంలో ఉన్న ఛైర్మన్ల తొలగింపునకు అవకాశం లేకపోవడంతోనే.. ఇన్ని రోజులు కౌన్సిలర్లు గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో.. అసమ్మతి గళమెత్తడమే కాదు.. ప్రభుత్వంలోని లొసుగులనూ కౌన్సిలర్లు ఎత్తిచూపిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఒకవైపు.. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని బీఆర్ఎస్‌ నేతలు చెప్తుంటే.. వార్డుల్లో అభివృద్ధి జాడ లేదని, చైర్మన్లు అవినితి జలగల్లా మారారని మెజార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

Untitled-2154.jpg

సొంత పార్టీ నేతల అవిశ్వాస తీర్మానంతో షాక్‌

ఇప్పటికే.. సిద్దిపేట జిల్లా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఊపందుకుంటున్నాయి. చైర్మన్లపై అసంతృప్తి, ఎమ్మెల్యేలతో విభేదాలు, వ్యక్తిగత కారణాలు ఆయా పరిస్థితులకు కారణమవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే రెండు చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. రెండింటిలో ఒకటి చేర్యాల కాగా.. రెండోది స్వయాన కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్ మున్సిపాలిటీ కావడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. క్యాంపు రాజకీయాలు కూడా మొదలవడం.. బీఆర్ఎస్‌లో చిచ్చురేపుతోంది. సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమై.. షాక్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పెద్దలు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ.. కౌన్సిలర్లు మాత్రం ససేమిరా అంటూ అవిశ్వాస తీర్మానానికి పట్టుపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు కూడా అందజేయడం బీఆర్ఎస్‌ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తోంది..

సీఎం ఇలాకాలో.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించినా..

ఇదిలావుంటే.. అవినీతి జాడ లేదని, అభివృద్ధికి తిరుగులేదని సర్కారు పెద్దలు చెప్తుండగా.. గజ్వేల్‌ మున్సిపాలిటీలో మాత్రం అందుకు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం ఇలాకాలో.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించినా.. ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నామంటూ కౌన్సిలర్లు ఆవేదన చెందుతున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అవినీతికి పాల్పడుతూ వార్డులు అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అవినీతి విషయంపై పలుమార్లు అధికారులు, నియోజకవర్గ నేతల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెప్తున్నారు. చైర్మన్ ఒంటెద్దు పోకడతో అవినీతి తప్ప అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళిక లేకుండా పోయిందంటున్నారు. మిగిలి ఉన్న కొద్దిరోజుల్లోనైనా.. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకుని.. వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది.

Untitled-2054.jpg

అసమ్మతి రాగం ఎందుకు రాజుకుంటుంది?

ఇక.. స్వయాన సీఎం కేసీఆర్ నియోజకవర్గం.. గజ్వేల్‌లో ఓ ఎమ్మెల్సీ, ఓ ఎఫ్‌డీసీ ఛైర్మన్ లాంటి పెద్ద నేతలు ఉండగా మున్సిపాలిటీలో అసమ్మతి రాగం ఎందుకు రాజుకుంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ అవినీతికి పాల్పడితే నిరూపించాలి.. కానీ.. కౌన్సిల్ సభ్యులు క్యాంప్ రాజకీయాలు చేయడం ఏంటి?.. ఎవరి స్వార్థం కోసం అవిశ్వాసం పెట్టారు?.. అనే కోణాల్లోనూ పార్టీ పెద్దలు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. గజ్వేల్‌లో గతంలోనూ నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు ధర్నాలు చేశారు. పాలకవర్గ సభ్యులు కూడా అధిష్టానాన్ని ధిక్కరించి కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌ అయింది.

Untitled-2254.jpg

మొత్తంగా.. సీఎం కేసీఆర్‌ సొంత ఇలాకా కావడంతో గజ్వేల్‌ గులాబీ పార్టీ రాజకీయాలు తెలంగాణ వ్యాప్తంగా హీట్‌ పుట్టిస్తున్నాయి. ఏదేమైనా.. గజ్వేల్‌ అసంతృప్తి మున్సిపల్‌ కౌన్సిలర్ల వ్యవహారంపై బీఆర్ఎస్‌ పెద్దలు ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-16T12:20:51+05:30 IST