AP Politics: ప్రభుత్వ ఉద్యోగుల్లో కాక రేపుతున్న జీపీఎస్.. 33 ఏళ్లకే సాగనంపుతారా?
ABN , First Publish Date - 2023-09-29T18:27:27+05:30 IST
జీపీఎస్ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ఏపీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాక ముందే ఉద్యోగి వయసు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపిస్తారు. అప్పుడు గ్యారంటీ పెన్షన్ పథకం అమలయ్యే అవకాశం ఉండదు.
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. జీపీఎస్ అంశంలో జగన్ ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నారు. గత ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని.. మడమ తిప్పారని సీఎం జగన్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీపీఎస్‌ను రద్దు చేయకుండా జీపీఎస్ అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అయితే జీపీఎస్ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఎంత సర్వీస్ ఉండాలన్న అంశంపై బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులతో ప్రభుత్వం పదవీ విరమణ చేయిస్తే అలాంటి ఉద్యోగులకు కనీసం 33 ఏళ్ల అర్హత సర్వీస్ ఉంటేనే జీపీఎస్ పథకం కింద గ్యారంటీ పెన్షన్ ప్రయోజనాలు అందుతాయని బిల్లులో పొందుపరిచారు.
33 ఏళ్ల సర్వీస్ నిబంధన ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కాక రేపుతోంది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాక ముందే ఉద్యోగి వయసు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపిస్తారు. అప్పుడు గ్యారంటీ పెన్షన్ పథకం అమలయ్యే అవకాశం ఉండదు. దీంతో జీపీఎస్ బిల్లులో ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధన వెనుక లోతైన కుట్ర ఉందని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. సాధారణంగా సర్వీసుతో పదవీ విరమణకు సంబంధం లేదు. కానీ ప్రజా ప్రయోజనాల మేరకు ఉద్యోగులను పదవీ విరమణ చేయించడం అన్నది ఇప్పటివరకు అమల్లో లేదు. ఫించన్ రూల్స్‌లో ఎప్పుడో ఉన్న ఈ నిబంధనను జీపీఎస్‌లో చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. రెండేళ్ల కిందట పదవీ విరమణ కావాల్సిన ఉద్యోగులు ఇప్పుడు రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్నారు. వీరంతా వచ్చే ఎన్నికల నాటికి లేదా ఎన్నికలు పూర్తయ్యే నాటికి రిటైర్ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది. ఒకవేళ రిటైర్ కాకపోయినా బలవంతంగా అయినా పంపుతారు. అప్పటికి కొందరికి 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాదు. దీంతో చాలా మంది గ్యారంటీ ఫించన్ పథకాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులు ఈ నిబంధనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Fact Check: అక్టోబర్‌లో ప్రభుత్వం రద్దు.. ముందస్తుకు వెళ్లేందుకు వైసీపీ ప్రణాళిక?
మరోవైపు వచ్చే ఎన్నికల తర్వాత 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 62 ఏళ్ల ఉద్యోగ విమరణ కింద ఉద్యోగులందరూ ఒకేసారి రిటైర్ అయితే ప్రభుత్వ పాలన సాధ్యం కాదు. అప్పుడు వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వాన్ని నడిపించేందుకు జగన్ సర్కారు కుట్ర చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదే ఆలోచనతో ప్రస్తుతం జీపీఎస్ బిల్లును ప్రభుత్వం తెచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీపీఎస్ పేరుతో ప్రభుత్వం చేసిన మోసాన్ని మరిచిపోకముందే ఇప్పుడు జీపీఎస్ పేరుతో తమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమకు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.