TS New Secretariat : అసలే కొత్త సచివాలయం.. ఆపై కేసీఆర్‌కు నమ్మకాలెక్కువ.. ఈ విషయం బాస్ దృష్టికి వెళ్తే..!?
ABN , First Publish Date - 2023-05-07T15:56:23+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. కోటాను కోట్లు వెచ్చించి నిర్మించిన కొత్త సచివాలయం (TS New Secretariat) గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు మీడియాలో పుంకాలు పుంకాలుగా ప్రత్యేక కథనాలు వచ్చేస్తున్నాయ్...
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. కోట్లు వెచ్చించి నిర్మించిన కొత్త సచివాలయం (TS New Secretariat) గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు మీడియాలో పుంకాలు పుంకాలుగా ప్రత్యేక కథనాలు వచ్చేస్తున్నాయ్. ఈ కథనాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసలు ఏది నిజమో.. ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇవన్నీ అటుంచితే.. సచివాలయంపై గత కొన్నిరోజులుగా గరుడ పక్షులు (గద్దలు Hawks) తిరుగుతుండటంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఇలా గద్దలు తిరగడం శుభమా..? అరిష్టమా..? అసలే సీఎం కేసీఆర్‌కు (CM KCR) నమ్మకాలెక్కువ.. ఈ గరుడ వ్యవహారం ఆయన దాకా వెళ్లిందా.. లేదా..? సచివాలయం ఉద్యోగులు దీనిపై ఏమంటున్నారు..? ఇంతకీ ఆ గద్దలు అక్కడికెలా వచ్చాయి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..
అసలేం జరిగింది..!?
కొత్త సచివాలయాన్ని రాజసానికి అద్దంపట్టేలా నిర్మించుకున్నామని కేసీఆర్ సర్కార్ (KCR Govt) తెగ ఊదరకొడుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రజాధనం అంతా వృథా అయ్యిందని.. కూల్చేస్తాం.. కూల్చి మళ్లీ కడతామని ఓ రేంజ్‌లో మండిపడుతున్నాయి. ఇప్పట్లో ఈ విమర్శలు, ప్రతివిమర్శలకు చెక్ పడేలా లేదు. అందుకే ఇలా సచివాలయం నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సచివాలయంపై గరుడ పక్షులు విహరించడం ఇప్పుడు తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. సచివాలయం ప్రారంభం అయిన నాటి నుంచి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గుమ్మటాలపైనే గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందట. సరిగ్గా సాయంత్రం విధులు ముగించుకుని బయటికి వస్తున్న టైమ్‌లోనే జీ-బ్లాక్ దగ్గర గరుడ పక్షులు కనిపిస్తుండటంతో చిత్రవిచిత్రాలుగా ఉద్యోగులు చర్చించుకుంటున్నారట. గద్దలు ఇలా తిరగడం శుభమా.. అరిష్టమా..? అని రానున్న రోజుల్లో ఊహించని పరిణామాలు ఏమైనా చోటుచేసుకుంటాయా..? అని తెలుసుకునే పనిలో పడ్డారట. కొందరు శుభమే అని చెప్పుకుంటుండగా.. అమ్మో గరుడ చాలా డేంజర్ అని మరికొందరు చెప్పుకుంటున్నారట. ఇంతవరకూ అంతా ఓకేకానీ.. అసలే సీఎం కేసీఆర్‌కు నమ్మకాలెక్కువ.. ఈ గరుడ వ్యవహారం ఆయన దృష్టికి వెళ్లిందా..? లేదా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ ఆయన దృష్టికి వెళ్తే ఏం చేస్తారనేది కూడా చర్చనీయాంశమే అయ్యింది.
ఇది కూడా నిజమేనేమో..!
వాస్తవానికి.. సచివాలయం ప్రదేశంలో ఒకప్పుడు నిజాం ప్యాలెస్ ఉండేది. ఇక్కడ్నుంచే ప్రధాని హోదాలో పాలనా వ్యవహారాలు నడుపుతుండేవారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు పరిపాలన కేంద్రంగానే నడిచేది. 1950వ దశకం మొదలుకుని కేసీఆర్ ప్రభుత్వం కూల్చక మునుపు వరకూ ఇక్కడే అన్ని కార్యకలాపాలు జరిగేవి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రధాన వ్యక్తులు అంటే.. ముఖ్యమంత్రి హోదాలో ఉండేవారు జీ బ్లాక్ అని, సీ బ్లాక్ అని మారుతుండేవారు కానీ భవనం మాత్రం అదే. ఇక్కడ్నుంచే ఎన్టీఆర్ (NTR), చంద్రబాబు (Chandrababu), వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy), రోశయ్య (Rosaiah), కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అంతా సమత (Samatha) అని పిలవబడే సీ, సర్వహిత (Sarvahitha) అని పిలవడే జీ బ్లాక్‌ల (G-Block) నుంచి సీఎం ఛాంబర్లు (CM Chambers) ఏర్పాటు చేసుకుని పాలన సాగించారు. అయితే కొన్నేళ్లుగా అది అలాగే ఉండటంతో శిథిలావస్థకు చేరుకుంది దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో పిచ్చి చెట్లు పెరగడంతో పాములు, పక్షులకు నిలయంగా మారింది. అప్పట్లోనే సాయంత్రం సమయంలో గద్దలు, గబ్బిలాలు కనిపించేవని ఇప్పుడు కూడా ఆహారం, ఆవాసం కోసం అలా తిరుగుతుండేవట. కేసీఆర్ ఆ పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్తగా నిర్మించడం జరిగింది. దీంతో వాటికి ఆవాసం లేకుండాపోయిందని.. అందుకే ఇలా ఇప్పుడు తిరుగుతున్నాయట. అయితే.. కొత్త భవనం ప్రాంగణంలో పురుగు, పుట్ర లాంటివేమీ లేనప్పుడు ఆహార అవసరాలకు కోసం గద్దలు రావడానికి ఆస్కారం లేనే లేదని సచివాలయం ఉద్యోగుల నుంచి వస్తున్నాయట. మరోవైపు.. ఇవన్నీ ఫేక్ (Fake) అని ఎప్పుడూ కనిపించని గద్దలు ఇప్పుడు కనిపించడమేంటి..? ఇదంతా ఫొటో షాప్ అని సోషల్ మీడియాలో ఫొటోలు, కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
నిజంగా అశుభమా..!
పక్షులలో గరుడ పక్షి అతిపెద్దది. గరుడ పక్షిశ్రీమహావిష్ణువు కోసం ఎంతో కఠినమైన తపస్సు చేసింది. తన కఠినమైన తపస్సుతో విష్ణు భగవానుడిని మెప్పించడం వల్ల విష్ణుమూర్తి తనకు వాహనంగా గరుడ పక్షిని నియమించుకున్నారని పెద్దలు చెబుతుంటారు. అందుకే విష్ణువు వాహనాన్ని గరుడాళ్వార్ అని అంటాం. ఆ విష్ణులోకంలో స్వామి వారి పాదసేవలో నిమగ్నమై ఉంటాడు. పక్షి సంతతుల్లో ఇది శ్రేష్టమైనది. గరుఢ పక్షి అంటే అతి పెద్దదిగా, నిశితమైన దృష్టి, కాళ్లు, రెక్కలతో విరాజమానమై ఉంటుంది. ఇప్పుడు కనిపించేవన్నీ గద్దలే. అవి కూడా పక్షుల సంతతే. గరుడ పక్షలు ఎత్తైన చోట్లలో కనిపించవచ్చు కానీ జనసామాన్యం ఉంటే చోట్ల కనపించడం ఉండదు. శుభాశుభాలనేవి మన కల్పితాలుగానే అనుకోవాలి. అలాంటి ఆలోచన వస్తే జపాలు జరిపించడం, విష్ణుమూర్తి, గరడుని సంతృప్తి పరిచే పూజాదికాలు చేయవచ్చని సిద్ధాంతులు, పండితులు చెబుతున్నారు. అంతేకాదు.. ‘గరుడ’ అంటే కఠినమైన విజయాన్ని సాధించిందని అర్థం కూడా వస్తుంది. గద్దలు కలలోకి రావడం, మన చుట్టూ తిరిగినా శుభసూచికమేనని కొందరు భావిస్తుంటారు. గద్దలు ఇళ్లపై తిరగడం ప్రకృతి వైపరీత్యాలకు సూచికలు అని.. రానున్న రోజుల్లో ఊహకు అందని రీతిలో పరిణామాలు చోటుచేసుకుంటాయని కూడా ఆందోళన చెందుతుంటారు.
మొత్తానికి చూస్తే.. ఒకవేళ గరుడ పక్షులు తిరగడం నిజమే అయితే ఏదైనా ప్రగాఢంగా విశ్వసించే కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. కొందరు పూజలు చేస్తే అంతా సెట్ అవుతుందని.. ఇంకొందరు రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్న ఈ క్రమంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? మరోసారి యాగం చేయడానికి ప్రయత్నిస్తారా లేకుంటే..అబ్బే ఇవన్నీ మామూలే అని మిన్నకుండిపోతారా..? ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల ఎలా రియాక్ట్ అవుతాయనేది.. ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.