Telangana BJP: ఇద్దరు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు రంగంలోకి.. తెలంగాణ బీజేపీది పెద్ద ప్లానే..!

ABN , First Publish Date - 2023-08-16T19:25:32+05:30 IST

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర నాయకత్వానికి కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ సర్కార్ జీవోలను, బడ్జెట్ లెక్కలను సేకరించాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ సమాచారం ఆధారంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచి ఎండగట్టాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే.. ఈ సమాచారాన్ని సేకరించే బాధ్యతను కొందరు ఎక్స్-బ్యూరోక్రాట్ల చేతిలో పెట్టినట్టు సమాచారం.

Telangana BJP: ఇద్దరు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు రంగంలోకి.. తెలంగాణ బీజేపీది పెద్ద ప్లానే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టే పనిలో తలమునకలై ఉన్నాయి. రాష్ట్ర నాయకత్వ మార్పు మొదలుకుని భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. ఇందు కోసం తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రయోగానికి కమలం పార్టీ తెరలేపినట్టు సమాచారం. అధికార బీఆర్‌ఎస్ వ్యూహాలకు సరైన రీతిలో బదులిచ్చేందుకు సమాయత్తమవ్వాలని తెలంగాణ బీజేపీకి కేంద్ర అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలందాయి.

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర నాయకత్వానికి కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ సర్కార్ జీవోలను, బడ్జెట్ లెక్కలను సేకరించాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ సమాచారం ఆధారంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచి ఎండగట్టాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే.. ఈ సమాచారాన్ని సేకరించే బాధ్యతను కొందరు ఎక్స్-బ్యూరోక్రాట్ల చేతిలో పెట్టినట్టు సమాచారం. వారివారి ఆసక్తులను బట్టి ఆర్థిక, విద్యుత్, నీటి పారుదల శాఖలకు సంబంధించిన కేటాయింపులు, అవకతవకలను తవ్వి తీయడమే ఈ మాజీ బ్యూరోక్రాట్ల పనిగా ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.


కేవలం బీఆర్‌ఎస్ అవినీతిపైనే కాకుండా గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలపై ఏమాత్రం ఖర్చు చేసిందనే విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని బీజేపీ వ్యూహ రచన చేసిందని తెలుస్తోంది. ఈ బాధ్యతను భుజానికెత్తుకున్న వారిలో ఇద్దరు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కూడా ఉండటం విశేషం. ఒకరు ఐవైఆర్ కృష్ణా రావు కాగా, మరొకరు ఎల్వీ సుబ్రమణ్యం. మొత్తం 20 మంది ప్రముఖులు ఈ వ్యూహానికి తగిన సమాచారాన్ని అందించనున్నట్లు తెలిసింది. మాజీ ఐపీఎస్ అధికారి టి కృష్ణ ప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్. చంద్రవదన్, ఏపీ పోలీస్ మాజీ ఉన్నతాధికారి ఎస్‌కె జయచంద్ర, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ సోదరుడు, అడ్వకేట్ నాగేంద్ర ఈ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే ఈ డేటా సేకరణ పనిని బీజేపీ మొదలుపెట్టింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రైవేట్ హోటల్‌లో కొందరు బీజేపీ ప్రముఖులతో జరిగిన సమావేశం సాక్షిగా కొంత కీలక సమాచారాన్ని అందజేసినట్లు టాక్.


తెలంగాణలో ఇప్పటికే మరో వ్యూహానికి బీజేపీ దూకుడుగా ముందుకెళుతోంది. తెలంగాణలో పార్టీ బలతోపేతం కోసం బీజేపీ అధిష్ఠానం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలో పర్యటించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కమలం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించేలా అధిష్ఠానం ప్రణాళిక రూపొందించింది. ఏ నియోజకవర్గంలో ఉండాలి? ఏం చేయాలి? వంటి అంశాలపై ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలకు సమాచారాన్ని అందజేసింది. 119 నియోజకవర్గాల్లో నాలుగు నెలల పాటు విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక్కో ఎమ్మెల్యే.. అధిష్ఠానం కేటాయించిన నియోజకవర్గంలో వారం పాటు మకాం వేసి, గ్రామ పంచాయతీ, బూత్‌ కమిటీ, శక్తి కేంద్రం, మండలం, నియోజకవర్గం ఇన్‌చార్జిలతో సమీక్షలు నిర్వహిస్తారు. నియోజకవర్గంలో పార్టీ ఏ స్థానంలో ఉంది? బలం ఎంటి? బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు. వీటి ఆధారంగా.. రానున్న రోజుల్లో ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎమ్మెల్యేల పర్యటనలు ప్రారంభమవుతాయని బీజేపీ జాతీయ నేత ఒకరు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలపైనా వారు దృష్టి సారిస్తారని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-16T19:25:35+05:30 IST