Bharat Row : ‘భారత్’ గురించి పవన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ
ABN , First Publish Date - 2023-09-05T18:10:24+05:30 IST
నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Govt) త్వరలో దేశం పేరు మార్చబోతుందన్న వార్త ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. మన దేశం పేరును ‘ఇండియా’ (India) అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ (Bharat) అని పేర్కొనడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది...
నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Govt) త్వరలో దేశం పేరు మార్చబోతుందన్న వార్త ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. మన దేశం పేరును ‘ఇండియా’ (India) అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ (Bharat) అని పేర్కొనడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ (President of India) అని ప్రింట్ చేయాల్సింది బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ (President of Bharat) అని రాయడం వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా త్వరలో పార్లమెంట్ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ‘ఇండియా’ పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ తీర్మానాన్ని తీసుకురాబోతోందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్పందిస్తుండగా.. అధికార బీజేపీ.. కాంగ్రెస్ (BJP, Congress) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. గతంలో ఓ కార్యక్రమంలో జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ‘ఇండియా’, ‘భారత్’ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ పవన్ ఏమన్నారు..?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ మాట్లాడుతూ భారతదేశం గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇండియాను భారత్ అని మారుస్తున్నారని చర్చ జరుగుతున్న వేళ పవన్ చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది’ అని ఈవెంట్‌లో పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియోను సేనాని వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. దీనిపై పలువురు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. బ్రిటిష్ వాళ్లు పేరు పెట్టారని అంటున్నారు సరే.. వారు కట్టిన ఆస్పత్రులు, స్కూల్స్, రైల్వే బ్రిడ్జ్‌లు ఇప్పటికీ ఉన్నాయ్ కదా వాటిని పడగొడతారా..? అని సెటైరికల్‌గా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో కాంగ్రెస్‌తో కూడిన కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టారని బీజేపీ దడ పుడుతోంది అందుకే ఏకంగా దేశం పేరునే మార్చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇప్పటికే ప్రముఖులు ఇలా..!
మమతా బెనర్జీ : ఇంత అకస్మాత్తుగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇండియా పేరును మారుస్తున్నట్టు విన్నాను. రాష్ట్రపతి భవన్ పంపిన జి-20 ఆహ్వానపత్రంలో ఈ పేరు మార్పు చోటుచేసుకుంది. మనం ఈ దేశాన్ని భారత్ అని పిలుస్తాం. అందులో కొత్త ఏముంది? ఇంగ్లీషులో ఇండియా అంటాం. ఇందులో పేరు మార్పుకోసం చేయాల్సిందేముంది? ఇండియా పేరు అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ దేశ చరిత్రను తిరగరాస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
వీరేంద్ర సెహ్వాగ్ : క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన ట్వీట్‌లో, పేరు మనకు గర్వకారణంగా నిలిచేదిగా ఉండాలని తాను ఎల్లప్పుడూ విశ్వసిస్తానని తెలిపారు. మనం భారతీయులమని, ఇండియా అనే పేరును బ్రిటిషర్లు పెట్టారని తెలిపారు. మన అసలు పేరు ‘భారత్’ను అధికారికంగా చాలా కాలం క్రితమే తిరిగి తీసుకుని రావలసిందని అన్నారు. ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఆడే భారతీయ క్రికెటర్ల జెర్సీలపైన ‘భారత్’ అని ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ, జయ్ షాలను కోరుతున్నానని తెలిపారు.
అమితాబ్ బచ్చన్ : ఇండియా, భారత్ వ్యవహారంపై ట్వీట్టర్ వేదికగా బిగ్ బి స్పందించారు. ‘ భారత్ మాతా కీ జై’ అని నినదించారు. దీనికి భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను జత చేశారు. అమితాబ్ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. జైహో, జై హింద్-జై భారత్... అంటూ ట్వీట్ చేశారు.