Karnataka Polls: నన్ను 91 సార్లు దూషించారు: మోదీ
ABN , First Publish Date - 2023-04-29T21:40:56+05:30 IST
కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేతలు తనను 91 సార్లు దూషించారని ప్రధానమంత్రి
బెంగళూరు: కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేతలు తనను 91 సార్లు దూషించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల(Karnataka Elections) ప్రచారానికి వచ్చిన ఆయన బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో కాంగ్రెస్ నేతల విమర్శలపై శనివారం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రధాని తిప్పికొట్టారు.
కాంగ్రెస్ నేతలు తనకు వ్యతిరేకంగా కఠినమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను విషసర్పం, చౌకీదార్, చోర్ అన్నారని, ప్రస్తుతం లింగాయత సోదరులను అవినీతి పరులతో పోల్చారని అన్నారు. తనను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను, దేశం కోసం పోరాడిన సావర్కర్‌ను విమర్శించిన వారు తనను వదిలిపెడతారా? అని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.
గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. ప్రధాని సమ్మాన్ పథకంలో లబ్ధిదారుల జాబితాను కూడా కేంద్రానికి పంపలేదని విమర్శించారు. ఆ పథకంలో లూటీ చేసేందుకు వారికి అవకాశమే లేదని వెనకడుగు వేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా లక్షలాది మంది అన్నదాతల ఖాతాలకు నగదు బదిలీ చేశామని గుర్తు చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో నాటకం ఆడుతోందని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో రుణమాఫీ ఎందు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు పేదల కష్టాలు అర్థం కావని అన్నారు. డబుల్ ఇంజన్ పాలనలో పేదల సంక్షేమం వేగవంతంగా సాగుతోందన్నారు. డబుల్ ఇంజిన్ అంటే డబుల్ బెన్‌ఫిట్, డబుల్ స్పీడ్ అని అన్నారు. ఇటు రాష్ట్రం అటు కేంద్రంలోను బీజేపీ ప్రభుత్వాలు ఉంటే డబుల్ శక్తి వస్తుందని, తద్వారా దేశంలోనే కర్ణాటక నంబర్ వన్‌గా మారుతుందని అన్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు. ప్రధాని మోదీ విజయపుర, కుడచి బహిరంగ సభలు ముగించుకుని బెంగళూరులో రోడ్ షోలో పాల్గొన్నారు.