Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..
ABN , First Publish Date - 2023-04-24T18:41:59+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసులో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని సీబీఐ విచారించి.. అరెస్ట్ చేయగా తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది...
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసులో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని సీబీఐ విచారించి.. అరెస్ట్ చేయగా తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కడప మాజీ ఎస్పీ రాహుల్దేవ్శర్మను (SP Rahuldev Sharma) సీబీఐ ప్రశ్నించింది. రాహుల్దేవ్ శర్మ నుంచి సీబీఐ అధికారులు (CBI Officers) కీలక సమాచారం సేకరించినట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. వివేకా కేసు వివరాలను సీబీఐకి ఎస్పీ రాహుల్దేవ్ సమర్పించారు. కాగా.. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్లో (SIT) రాహుల్ సభ్యుడిగా ఉన్నారు. హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో లభించిన ఆధారాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. సీబీఐ కార్యాలయంలో 2 గంటలపాటు రాహుల్ విచారణ జరిగింది. కాగా.. వివేకా హత్య జరిగిన సమయంలో రాహుల్దేవ్శర్మ కడప జిల్లా ఎస్పీగా ఉన్నారు.
ఈ టైమ్‌లోనే ఎందుకో..!
ఇదే కేసులో ఓ వైపు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Kadapa MP Avinash Reddy) మూడ్రోజులు.. వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డిలను (Uday Kumar Reddy) ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు. ఈ గ్యాప్‌లోనే వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిని (YS Sunitha Husband Rajasekhar Reddy) కూడా సీబీఐ విచారించింది. ఈ విచారణ ఇలా కొనసాగుతుండగానే ఈసారి ఏకంగా.. ఎస్పీ రాహుల్‌దేవ్‌ను సీబీఐ ప్రశ్నించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న ఈ టైమ్‌లోనే రాహుల్‌ను సీబీఐ ఎందుకు పిలిపించింది..? విచారణలో ఆయన ఏం చెప్పారు..? కీలక సమాచారాన్నే సీబీఐ రాబట్టిందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ విచారణలో నిందితుల నుంచి సేకరించిన వివరాలకు.. ఎస్పీ చెప్పిన విషయాలకు సీబీఐ పోల్చి చూడనున్నట్లు తెలియవచ్చింది.
గతంలో ఎస్పీ ఏం చెప్పారంటే..!
వైఎస్ వివేకానందరెడ్డి ది హత్యగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఘటన జరిగిన తర్వాత ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. మార్చి 15న కడపలో మీడియాతో మాట్లాడిన ఎస్పీ..‘ హత్యకు సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు గుర్తించాం. ఆ వేలిముద్రలు ఎవరివో తేల్చే పనిలో ఉన్నాం. కేసు దర్యాప్తులో మరింత మంది నిపుణులను వినియోగించనున్నాం. వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుంది. వివేకా శరీరంపై ఏడు చోట్ల గాయాలున్నాయి. నుదిటిపై రెండు లోతైన గాయాలు, తల వెనుక భాగంలో మరో బలమైన గాయం ఉంది. ఛాతీ, తొడ భాగంలోనూ గాయాలు ఉన్నట్టు గుర్తించాం’ అని అప్పట్లో ఎస్పీ తెలిపారు. అంతేకాదు.. ఫోరెన్సిక్ నివేదికలో వివేకానంద రెడ్డిది హత్యేనని తేలిన తర్వాత వివేకా నివాసానికి వెళ్లిన ఎస్పీ ఘటనా స్థలిని పరిశీలించారు.
మొత్తానికి చూస్తే.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తర్వులను ఆపేసిన తర్వాత సీబీఐ మరింత దూకుడు పెంచిందని తాజా ఘటనతో చెప్పుకోవచ్చు. మరోవైపు.. జూన్-30వరకు దర్యాప్తు గడుపు పెంచడంతో ఈ రెండు మూడ్రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కీలక మలుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసులో ఇక ముందు ఏమేం జరుగుతుందో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి మరి.