Ponguleti: పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినా సేఫ్ జోన్‌లో షర్మిల.. కానీ పెద్ద దెబ్బ ఎవరి కంటే..
ABN , First Publish Date - 2023-06-08T15:48:15+05:30 IST
బీఆర్‌ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచర గణంతో త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలతో ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఆశించిన పలువురిలో కలవరం మొదలైంది.
కాంగ్రెస్ ఆశావహుల్లో పొంగులేటి కలవరం
మాజీ ఎంపీ చేరితే మారనున్న హస్తం సమీకరణలు
ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తన అనుచర గణంతో త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలతో ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఆశించిన పలువురిలో కలవరం మొదలైంది. ఖమ్మం లేదంటే హైదరాబాదులో భారీ బహిరంగసభ నిర్వహించి ప్రియాంకగాంధీ సమక్షంలో పొంగులేటి, ఆయన వర్గీయులు హస్తం కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తుండటంతో తమ భవితవ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు తమకే అభ్యర్థిత్వాలు దక్కుతాయని భావిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి, ఆయన ద్వారా చేరే వారితో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ సమీకరణలు మారుతాయోనని, తమ ఆశలకు ఎక్కడ గండిపడుతుందోనని మదనపడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మధిర నుంచి సీఎల్పీనేత భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పినపాక నుంచి గెలిచిన రేగాకాంతారావు పాలేరునుంచి గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి, ఇల్లెందులో బానోతు హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు నలుగురు పార్టీ ఫిరాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండాలని ఆశపడిన వారు కొంతకాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి తన వర్గం నుంచి మొత్తం పదినియోజకవర్గాల్లో అభ్యర్థులుంటారని ప్రకటించడంతో పాటు.. కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పేర్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారంతా కాంగ్రెస్‌లో చేరితే అధిష్ఠానం పొంగులేటికి ఉన్న పలుకుబడికి తలొగ్గి.. ఆయన వర్గీయులకు అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే తమ పరిస్థితేంటన్న మీమాంసలో ఉన్నారు.
పొంగులేటి కూడా తాను కాంగ్రెస్‌లో చేరాలంటే.. తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందుంచారని, అందుకు అధిష్ఠానం కూడా సానుకూలంగా స్పందించిందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పొంగులేటి వర్గం తరపున పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటనుంచి జారె ఆదినారాయణ, ఇల్లెందులో జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, వైరాలో బానోతు విజయబాయి, సత్తుపల్లిలో రిటైర్డు పీఆర్ ఈఈ సుధాకర్‌రావు పేర్లు వినిపిస్తుండగా.. కొత్తగూడెం లేదంటే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అభ్యర్థిత్వాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక పాలేరులో వైఎస్ షర్మిల కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉంటారని, అందుకు పొంగులేటి కూడా సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈప్రక్రియ జరిగితే ప్రస్తుతం పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని భట్టి, రేణుక వర్గీయుల ఆశలు గల్లంతయ్యే అవకావం లేకపోలేదు. పొంగులేటి వర్గం తమకు ఎక్కడ చేటు తెస్తుందోనని భయపడుతున్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం తాము ఎంతో చేస్తున్నామని మొరపెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం వర్గాల వారీగా టికెట్లు ఉండవని, సర్వేల ఆధారంగానే గెలుపు అవకాశాలున్న వారికి అభ్యర్థిత్వాలు ఉంటాయని స్పష్టం చేస్తోంది.