RajyaSabha : రాజ్యసభకు ఈసారి ‘కేకే’ డౌటే.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..!?
ABN , First Publish Date - 2023-08-17T22:16:00+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తన ప్రాణ స్నేహితుడు.. ఎంపీ కేశరావును (MP Kesavarao) పక్కనెట్టేస్తున్నారా..? మరోసారి ఆయన్ను ఢిల్లీ పంపే ఆలోచన గులాబీ బాస్ లేదా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. దీనికి చాలానే కారణాలున్నాయని బీఆర్ఎస్ (BRS) వర్గాలు చెబుతున్నాయి..
తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తన ప్రాణ స్నేహితుడు.. ఎంపీ కేశరావును (MP Kesavarao) పక్కనెట్టేస్తున్నారా..? మరోసారి ఆయన్ను ఢిల్లీ పంపే ఆలోచన గులాబీ బాస్ లేదా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. దీనికి చాలానే కారణాలున్నాయని బీఆర్ఎస్ (BRS) వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడీ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఎందుకింత చర్చ..? కేకే మీద కేసీఆర్‌కు కోపమా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..!
తెలంగాణలో త్వరలో రెండు రాజ్యసభ (Rajyasabha) స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు రాజ్యసభ ఎంపీగా ఉంటూ వస్తున్న కేశవరావును ఈసారి కేసీఆర్ పక్కనెడతారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. కేకే వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. తానే స్వయంగా ఈ విషయాన్ని గులాబీ బాస్‌కు చెప్పినట్లుగా తెలియవచ్చింది. మరోవైపు.. ఈ మధ్యనే కేకే కుటుంబంపై (KK Family) భూముల ఆక్రమణ ఆరోపణలు రావడంతో ఇక ఇంతకుమించి ఎంకరేజ్ చేయకూడదని కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో కేకే స్థానంలో అంతటి నమ్మకస్తుడు.. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే వ్యక్తి ఎవరున్నారా..? అని బాస్ ఆలోచనలో పడ్డారట. అయితే.. ఈ రెండు స్థానాలకోసం పదుల సంఖ్యలో ఆశావహులు ఉండగా.. కేసీఆర్ మనసులో కొంత మంది ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోనికి తీసుకుని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టాక్ నడుస్తోంది. దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికి ఇదొక సువర్ణావకాశంగా మలుచుకోవడానికి సారు ప్రయత్నాలు చేస్తున్నారట.
ఆశవాహులెవరు.. సార్ ఏమనుకుంటున్నారు..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును (Thummala Nageswara Rao) రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారట. తద్వారా ఖమ్మం రాజకీయాన్ని సానుకూలంగా మలుచుకోవచ్చని అనుకుంటున్నారట. మరోవైపు.. సామాజిక కోణంలో చూస్తే పలువురు సీనియర్లు రాజ్యసభ పదవులు దక్కొచ్చని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారట. పార్టీకి కొన్నేళ్లుగా సేవ చేస్తున్న తాము తప్పకుండా కేసీఆర్ మనసులో ఉంటామని ఈసారి కచ్చితంగా తామే రాజ్యసభకు వెళ్తామని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారట. కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారట. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూధనాచారి, బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, గాదరి బాలమల్లు, సీతారామ్ నాయక్.. పార్థసారథి రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది. అప్పుడున్న పరిస్థితులు, సామాజిక వర్గాల పరంగా చూసుకుని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.