Krishna District తలనొప్పిగా మారిని మైలవరం పంచాయతీ..Cm Jagan వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయని వైనం..

ABN , First Publish Date - 2023-02-15T08:59:02+05:30 IST

రాజకీయ చైతన్యానికి మారు పేరైన కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన పంచాయితీలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. రోజురోజుకీ వైసీపీలో అంతర్గత

Krishna District తలనొప్పిగా మారిని మైలవరం పంచాయతీ..Cm Jagan వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయని వైనం..

ఎన్‌టీఆర్‌ జిల్లా వైసీపీలో ఆ ఇద్దరు నేతల మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పడడం లేదు. బయటకు.. అంతా బాగానే కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం రగిలిపోతున్నారు. స్వయాన సీఎం రంగంలోకి దిగినా పోరు సర్దుబాటు కాలేదు. ఆయన్ను కలిసి వచ్చిన మరుసటి రోజే ప్రత్యర్థిపై వాగ్బాణాలు విసిరారు. ముఖ్యమంత్రి నేరుగా హెచ్చరించినా ప్రత్యర్థి వైఖరి మారలేదు. ఇంకేముంది.. లోలోపల రగులుతున్న రగడ.. వైసీపీని రెండు వర్గాలుగా చీల్చింది. ఇంతకీ.. ఎవరా ఇద్దరు నేతలు?.. సీఎం రంగంలోకి దిగినా వివాదం ఎందుకు సద్దుమణగలేదు?..మరిన్ని విషయాలే ఏబీఎన్ ఇన్ సైడ్ లో తెలుసుకుందాం..

Untitled-354.jpg

విభేదాలు పతాకస్థాయికి..తేలని మైలవరం పంచాయితీ

రాజకీయ చైతన్యానికి మారు పేరైన కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన పంచాయితీలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. రోజురోజుకీ వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మొన్న మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరి వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ తర్వాత.. అవనిగడ్డలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అలాగే.. మైలవరం వైసీపీలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న పంచాయితీ ఒక పట్టాన తేలడం లేదు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కృష్ణప్రసాద్ అనుమతి లేకుండానే నియోజకవర్గంలోని పోలీస్ అధికారులను జోగి రమేష్‌ సిఫార్స్‌తో నియమించడం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం వైసీపీ విభేదాలను పతాకస్థాయికి తీసుకెళ్లాయి.

వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రచ్చరచ్చ

వాస్తవానికి... మంత్రి జోగి అత్యుత్సాహం ప్రదర్శించడం.. వర్గాలను ప్రోత్సహించడంపై ముఖ్యమంత్రికి, ప్రధాన సలహాదారుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే.. ఇటీవల ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్‌ ప్లాంట్ బూడిద తరలించే విషయంలో జోగి అనుచరుడు అసభ్య పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ రగిలిపోయారు. ఆయా వ్యవహారాలు వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రచ్చరచ్చ అయింది. దాంతో.. జోగి రమేష్‌ను ముఖ్యమంత్రి జగన్‌.. మైలవరంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ క్యాబినెట్ సమావేశంలోనే నిలదీశారు. ఆ తర్వాత, వసంత కృష్ణప్రసాద్‌ను పిలిపించి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరూ జోక్యం చేసుకోరని చెప్పడమే కాకుండా.. నువ్వు నాతో 25 సంవత్సరాలు రాజకీయ ప్రయాణం చేయాలంటూ భరోసా ఇచ్చారు. ఆ సమయంలోనే.. జోగి రమేష్‌ వైఖరిని.. మైలవరంలోని ప్రతి అంశంలో వేలు పెట్టడాన్ని.. కృష్ణప్రసాద్ జగన్‌ దగ్గర నిర్మొహమాటంగా చెప్పారు. అయితే.. ఇకపై ఎవరూ జోక్యం చేసుకోరని సీఎం హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగినట్లేనని అందరూ ఊహించారు. కానీ.. మైలవరం వైసీపీ వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది.

Untitled-654.jpg

ఎంతో భరోసా ఇచ్చిన సీఎం జగన్‌

కృష్ణప్రసాద్‌కు ఎంతో భరోసా ఇచ్చిన సీఎం జగన్‌.. నియోజకవర్గంలో జోగి నియమించిన అధికారులను మాత్రం బదిలీ చేయలేదు. జోగి వర్గం కూడా ఇంకా వేరు కుంపటి పెట్టుకొని కూర్చున్నారు. నిజానికి.. జోగి వర్గానికి చెందిన ఎక్కువమందిని వసంత కృష్ణప్రసాదే సొంతగా డబ్బు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించారు. అలాంటి వ్యక్తులే వ్యతిరేకంగా కుంపటి రాజేయడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎంను కలిసి వచ్చిన తర్వాత కూడా వసంత కృష్ణప్రసాద్.. జోగి రమేష్‌ హుందాగా పెద్ద మనిషిగా వ్యవహరిస్తారని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. నలుగురిలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడి, ఆ తర్వాత నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని వసంత కృష్ణప్రసాద్ బహిరంగంగానే చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.

Untitled-754.jpg

ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పడమేంటి?

ఇదిలావుంటే.. వసంత కృష్ణప్రసాద్‌ను సీఎం పిలిపించి మాట్లాడినప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం సంతృప్తిగా లేనట్లు టాక్‌ నడుస్తోంది. సీఎం పేషీ అధికారి దగ్గర ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని జగన్‌ చెప్పడం వసంత వర్గీయులకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో.. వసంత కూడా కొన్నాళ్లు వేచి చూసి.. జోగి రమేష్‌ జోక్యం తగ్గకపోతే పోటీ చేయనని అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి స్థాయిలోనే విభేదాలు పరిష్కారం కాకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అటు.. మైలవరంలోనే కాదు.. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ జోగి జోక్యం చేసుకోవడాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోనున్న ఒక్కగానొక్క మంత్రి అనే ఉద్దేశ్యంతో.. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే ఊరుకోబోమని.. అవసరమైతే అందరూ కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి, మాట్లాడాలని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది.

Untitled-454.jpg

మొత్తంగా... జోగి రమేష్‌ వ్యవహారం కృష్ణా, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో కాక పుట్టిస్తోంది. జోగి రమేష్‌ ఇష్టారీతి జోక్యం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యమంత్రి వార్నింగ్‌ ఇచ్చినా జోగి రమేష్‌ మారకపోవడం చర్చకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గమే కాదు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీ వర్గ విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.

Updated Date - 2023-02-15T09:49:17+05:30 IST