Nara Lokesh Yuvagalam: కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ కటౌట్ వెనుక ఇంత కథ ఉందా..?

ABN , First Publish Date - 2023-07-20T15:15:28+05:30 IST

ప్రకాశం జిల్లాలో ‘యువగళం’లో భాగంగా యువనేత నారా లోకేశ్‌ను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేశ్‌ను ఒక రాజకీయ వారసుడిగా చూసే రోజులు పోయి మాస్‌ ఇమేజ్‌తో ముందుకెళుతున్న టీడీపీ యువ రక్తంగా ప్రజలు, కార్యకర్తలు భావిస్తున్నారనడానికి ఈ కటౌట్ ఒక నిదర్శనం. ఈ కటౌట్‌లో నారా లోకేశ్ తప్ప వేరెవరూ లేరు.

Nara Lokesh Yuvagalam: కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ కటౌట్ వెనుక ఇంత కథ ఉందా..?

నారా లోకేశ్. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా రాజకీయ అరంగేట్రం సులువుగానే చేసినా ఆటుపోట్లు, అవమానాలు తప్పలేదు. ఎమ్మెల్సీగా నామినేట్ అయి, ఐటీ మంత్రిగా ఏపీకి సేవలందించిన యువనేత 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత అధికార వైసీపీ యువ నేతను మరింత టార్గెట్ చేసింది. రాజకీయంగా పలుచన చేసేందుకు శత విధాలా ప్రయత్నించింది. అసెంబ్లీ సాక్షిగా అవమానించింది.

20230720_151031.jpg

వైసీపీ మంత్రులైతే నోటికొచ్చినంతలా లోకేశ్‌ను దుర్భాషలాడారు. ఇప్పటికీ అవకాశం ఉన్నప్పుడల్లా విజ్ఞత మరిచి యువ నేతపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతుంటారు. రాజకీయ పార్టీలన్నాక విమర్శలుప్రతివిమర్శలు సహజం. కానీ.. వైసీపీ నాయకులు మాత్రం వ్యక్తిగత విమర్శలతో దాడికి దిగుతుంటారు. సోషల్ మీడియా సాక్షిగా నారా లోకేశ్‌ను దిగజార్చడానికి వైసీపీ చేయని పనంటూ లేదు.


20230720_143932.jpg

లోకేశ్ ప్రసంగాలలోని లోపాలను అవహేళన చేయడం, ఆయన ఆహార్యాన్ని అపహాస్యం చేయడంతో సహా ఇంతకు మించి దిగజారదని భావించినప్పుడల్లా ఆ ఆలోచనే తప్పని వైసీపీ రుజువు చేసింది. కానీ.. ఆ అవమానాలన్నింటినీ భరిస్తూనే యువ నేత ముందుకు సాగారు. రాజకీయాల్లో రాటు తేలడం నేర్చుకున్నారు. వైసీపీ ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేసినా రాజకీయంగా విమర్శించారే తప్ప జగన్ కుటుంబం గురించి పల్లెత్తు మాట కూడా లోకేశ్ అనకపోవడం యువనేత రాజకీయ పరిణతికి నిదర్శనమని ‘యువ గళం’ పాదయాత్రను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకుల మాట. అంతేకాదు.. ‘యువగళం’ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా లోకేశ్ అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.

20230720_151040.jpg

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ ‘యువ గళం’ పాదయాత్ర సాగుతోంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా ‘యువగళం’ పాదయాత్ర మొదలైంది. బాలకృష్ణ అల్లుడిగా రాయలసీమలో పాదయాత్ర సాగింది. ప్రకాశం జిల్లాకు పాదయాత్ర చేరుకునేసరికి యువనేత తన సొంత ఇమేజ్‌తో ముందుకు సాగుతుండటం విశేషం. పాదయాత్ర మొదలయిన సమయానికి ఇప్పటికీ యువనేత గ్రాఫ్ పెరిగిందని అంతర్గతంగా చేసిన సర్వేల్లో కూడా స్పష్టమైంది. లోకేశ్ ప్రజలతో మమేకమవుతున్న తీరు, కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్న విధానం ప్రజల్లో యువనేతకు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రకాశం జిల్లా పాదయాత్రలో యువనేతకు వస్తున్న ప్రజా స్పందన గానీ, టీడీపీ శ్రేణులతో పాటు యువనేత రాకను హర్షిస్తూ ప్రజలు ఏర్పాటు చేస్తున్న కటౌట్లు, ఫ్లెక్సీలు లోకేశ్‌పై పెరుగుతున్న ప్రజాభిమానాన్ని రుజువు చేశాయి.

20230720_151053.jpg

తాజాగా.. ప్రకాశం జిల్లాలో ‘యువగళం’లో భాగంగా యువనేత నారా లోకేశ్‌ను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేశ్‌ను ఒక రాజకీయ వారసుడిగా చూసే రోజులు పోయి మాస్‌ ఇమేజ్‌తో ముందుకెళుతున్న టీడీపీ యువ రక్తంగా ప్రజలు, కార్యకర్తలు భావిస్తున్నారనడానికి ఈ కటౌట్ ఒక నిదర్శనం. ఈ కటౌట్‌లో నారా లోకేశ్ తప్ప వేరెవరూ లేరు. టీడీపీ అధినేత చంద్రబాబును, నందమూరి బాలకృష్ణను ఆ కటౌట్‌లో భాగం చేయలేదు. ఈ భారీ కటౌట్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొండెపిలో ఏర్పాటు చేసిన ఆ కటౌట్ చూసి టీడీపీ కార్యకర్తలు మురిసిపోతున్నారు. ఒక క్లాస్ మెంటాలిటీ ఉన్నవాడిని పూర్తి మాస్‌గా మార్చేశారని ఆ కటౌట్ గురించి ఎలివేషన్స్‌తో సోషల్ మీడియాను పసుపు సైన్యం మోత పుట్టిస్తోంది.

20230720_151059.jpg

యువగళంతో యుద్ధం మొదలైందని ఆ కటౌట్ చూసి టీడీపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 2100 కిలోమీటర్ల మైలు రాయిని ‘యువగళం’ పాదయాత్ర చేరుకుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా యువ నేత కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అంచనాలకు మించి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు స్పందన ఉందనడానికి ఫొటోలు, విజువల్సే నిదర్శనం. ఒక మాస్ ఇమేజ్‌తో ముందుకు సాగుతున్న నారా లోకేశ్ పాదయాత్ర ముగిసే సమయానికి ప్రజా నేతగా మన్ననలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2023-07-20T15:15:31+05:30 IST