Elections Stunt: గ్యాస్ ధరలు తగ్గాయి.. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయా?

ABN , First Publish Date - 2023-08-29T19:17:31+05:30 IST

మోదీ ప్రభుత్వం ప్రజలకు కానుక పేరుతో తగ్గించిన గ్యాస్ ధరలు ఆరంభం మాత్రమే. మరికొద్దిరోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో రూ.5 వరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Elections Stunt: గ్యాస్ ధరలు తగ్గాయి.. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయా?

కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి ప్రజలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. మరో మూడు నెలల్లో దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు ధరల తగ్గింపును పావుగా వాడుకుంటోంది. గతంలో భారీగా పెంచిన ధరలను ఇప్పుడు తగ్గిస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది. బీజేపీ హయాంలో గత పదేళ్లలో గ్యాస్ రేట్లు దాదాపు 115 శాతం పెరిగాయి. మొన్నటికి మొన్న గ్యాస్ రేట్లు తగ్గించాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారమే ధరలు పెంచామని బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము ధరలు తగ్గించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. నిత్యావసర ధరలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని గ్రహించి ఇప్పుడు తాము పెట్టిన వాతలకు వెన్న పూసే ప్రయత్నాలు షురూ చేశారు.

తాజాగా దేశంలోని మహిళలకు రాఖీ పండగ కానుక అంటూ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అటు ఉజ్వల్ స్కీం కింద గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 తగ్గించింది. దీంతో అసలు బీజేపీ సర్కారు గ్యాస్ ధర పెంచింది ఎంత.. తగ్గించింది ఎంత అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన సమయంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండేది. అందులోనూ పేదలకు కొంత మొత్తంలో గ్యాస్ సబ్సిడీ లభించేది. 2023లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కి చేరింది. అంతేకాకుండా మోదీ సర్కారు గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించింది. కొందరికి మాత్రం గ్యాస్ సబ్సిడీ కూడా రావడం లేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా పెంచిన ధరల్లో కొంత తగ్గించి మోదీ సర్కారు ఏదో మహిళలకు కానుక ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు. ప్రజల వద్దకు ఓట్లకు వెళ్లే సమయం వస్తుండటంతో ఎందుకైనా మంచిదని దోపిడీని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.


మోదీ ప్రభుత్వం ప్రజలకు కానుక పేరుతో తగ్గించిన గ్యాస్ ధరలు ఆరంభం మాత్రమే. మరికొద్దిరోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా దిగొచ్చినా.. దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ రేట్లను బీజేపీ సర్కారు సవరించి తమ గొప్పగా ప్రచారం చేసుకోనుంది. గత పదేళ్లుగా.. ముఖ్యంగా కరోనా లాంటి విపత్తు తర్వాత ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడానికి, సామాన్యుల జీవితం భారంగా మారడానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారాలే కారణం. అయినా మోదీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక దశలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 వరకు వెళ్లింది. కానీ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో ఆ సమయంలో లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.5 తగ్గించింది. ఇప్పుడు మరోసారి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో రూ.5 వరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా చూస్తే బీజేపీ సర్కారు ధరల తగ్గింపు చర్యలు ఎన్నికల స్టంట్ అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ప్రజలు బీజేపీ సర్కారును నమ్మి ఓటు వేస్తే భవిష్యత్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పలువురు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-08-29T19:23:40+05:30 IST