PM Modi Hyderabad Tour: మంత్రి తలసాని వీడియో వైరల్.. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపుతుండగా ఏమైందంటే..
ABN , First Publish Date - 2023-04-08T13:41:25+05:30 IST
తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది జగమెరిగిన సత్యం. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో..
తెలంగాణలో బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది జగమెరిగిన సత్యం. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) సమీపిస్తుండటంతో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా.. హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన (PM Modi Hyderabad Tour) బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న పొలిటికల్ హీట్‌కు (BRS vs BJP) సాక్ష్యంగా నిలిచింది. ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ డుమ్మా కొట్టారు. అంతేకాదు, ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ బదులు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు, ప్రధాని పర్యటనలో భాగమయ్యేందుకు వెళ్లిన మంత్రి తలసాని కూడా ‘ఎవరో ఒకరు రావాలి కాబట్టి వచ్చాం.. ఏదో ఉండాలంటే ఉన్నాం..’ అన్నట్టుగా వ్యవహరించారు. ‘వందే భారత్’ ట్రైన్‌కు మోదీ పచ్చ జెండా ఊపిన సమయంలో ఈ విషయం స్పష్టమైంది.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలును (Secunderabad to Tirupati Vande Bharat Express) ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమయంలో.. ప్రధాని పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి తలసాని ఉన్నారు. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపాక రైలు వెళుతున్న సమయంలో హర్షం వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డి, తమిళిసై చప్పట్లు కొట్టారు. తలసాని కూడా వారితో కలిసి చప్పట్లు కొట్టేందుకు ప్రయత్నించి ఏదో నామమాత్రంగా చేతులు ఆడించారు. ఎందుకో మళ్లీ కాసేపటికే వెంటనే ముందున్న చేతులను వెనక్కి పెట్టేసుకున్నారు. అందరూ క్లాప్స్ కొడుతుంటే తలసాని మాత్రం చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేసేందుకు ఆసక్తి చూపలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలును చూసి తన్మయత్వంతో తలసాని చప్పట్లు కొట్టారని తెలంగాణ బీజేపీ ప్రచారం చేస్తే ఎక్కడ బీఆర్‌ఎస్‌కు ఇబ్బందవుతుందోనన్న ఆలోచనతో తలసాని చప్పట్లు కొట్టకుండా ఆగిపోయి ఉండొచ్చని ఈ సన్నివేశాన్ని చూసిన మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్రం చేస్తున్న అభివృద్ధిని చూసి చప్పట్లు కొట్టేందుకు కూడా బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు చేతులు రావడం లేదని సోషల్ మీడియాలో అప్పుడే తలసాని తీరును తెలంగాణ బీజేపీ ఎండగడుతుండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పంచుకోవాల్సిన కార్యక్రమాల విషయంలో బీఆర్‌ఎస్ ఆచితూచి అడుగులేస్తోంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే.. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చే పరిస్థితి ఉందనే ఏ కార్యక్రమంలోనూ భాగం కాకూడదన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరుకావాల్సి ఉన్నందున ఒక మంత్రిని పురమాయించి మమ అనిపించేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సమాచారం. మంత్రి తలసాని పలు సందర్భాల్లో ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమైన సంగతి తెలిసిందే. కేవలం కేంద్రంతోనే కాదు.. రాష్ట్రంలో ఉండే గవర్నర్ తమిళిసైతో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ తీరులోనే వ్యవహరిస్తుండటం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు విడిదికి వచ్చిన సమయంలో గవర్నర్ తమిళిసైతో కలిసి కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అయితే.. అదే రోజు రాత్రి గవర్నర్ ఇచ్చిన విందుకు మాత్రం కేసీఆర్ హాజరు కాలేదు.
కేంద్రంతో వైరాన్ని, గవర్నర్‌తో దూరాన్ని పాటించే విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా అడుగులు వేస్తూ.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమైతే తెలంగాణ సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలోచనతో కేసీఆర్ ఈ పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆజ్ఞలను శిరసావహించే మంత్రి తలసాని కూడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమైనా తమ పార్టీ వైఖరికి తగ్గట్టుగానే వ్యవహరించడం గమనార్హం.