Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్
ABN , First Publish Date - 2023-09-13T16:36:59+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం (Jagan Govt) అక్రమంగా అరెస్ట్ చేసిన బాబును ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) న్యాయపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం (Jagan Govt) అక్రమంగా అరెస్ట్ చేసిన బాబును ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) న్యాయపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చంద్రబాబుకు రిమాండ్ వద్దని, అరెస్ట్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రత లేదని.. ఆయన్ను హౌస్ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తర్వాత తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించడం.. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు సిద్ధం చేసిందో వాటన్నింటిపైనా ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ మొదలుకుని ఇప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలపై తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కత్తి దూసాల్సిందే..!
చంద్రబాబుపై కేసుల విషయంలో ఇక తగ్గేదేలే అన్నట్లుగా లూథ్రా ట్వీట్ చేశారు. ఇక కత్తి దూసి పోరాడాల్సిందేనని.. ఔరంగజేబుకు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ రాసిన జఫర్నామాలోని కొన్ని వాఖ్యలను ట్వీట్‌లో ఆయన ప్రస్తావించారు. ‘ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అంటూ గురుగోవింద్ సింగ్ సూక్తిని లూథ్రా ట్వీట్ చేశారు. దీంతో పాటు చంద్రబాబుకు సపోర్టుగా చేసిన పలు ట్వీట్లను కూడా సిద్ధార్థ రీట్వీట్ చేశారు. ఆఖరిగా ‘ఈ రోజు ఇదే నా నినాదం’ అని లూథ్రా పేర్కొన్నారు.
బాబుతో ములాఖత్..
ఈ ట్వీట్ చేసిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సాయంత్రం 4 గంటలకు బాబుతో లూథ్రా భేటీ అయ్యారు. పలు కేసులపై చంద్రబాబుతో ఆయన చర్చించారు. ఇప్పటికే చంద్రబాబు భద్రతపై లూథ్రా ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు.. కేసులపై చంద్రబాబుతో చర్చించారు. ఈ భేటీ తర్వాత ఆయన మీడియా మీట్ నిర్వహిస్తారా లేకుంటే.. ట్వీట్ చేస్తారా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.