TS Assembly Elections : బీఆర్ఎస్‌కు అవాక్కయ్యే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి..!
ABN , First Publish Date - 2023-10-02T14:35:27+05:30 IST
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ (Congress, BJP) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ (Congress, BJP) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) ముందుంటే.. ఒక్క అభ్యర్థులను పక్కనెట్టి మిని మేనిఫెస్టో, గ్యారంటీ స్కీములను ప్రకటించి జనాల్లోకి దూసుకెళ్తోంది కాంగ్రెస్. ఇక బీజేపీ అయితే.. కేంద్రం నుంచి కమలనాథులను (BJP Leaders) తీసుకొచ్చి మరీ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించే యత్నం చేస్తూ వస్తోంది. దీంతో.. అధికార పార్టీకి దిక్కుతోచని పరిస్థితి అయ్యింది. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీముల ప్రకటన తర్వాత అడ్రస్ కనిపించకుండా పోయిన కేసీఆర్‌కు.. బీఆర్ఎస్ అవాక్కయ్యేలా వార్త చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy).
బీఆర్ఎస్ అవాక్కే..!
‘బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనివ్వం. ఈ నెలలో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ఉంటుంది. మేనిఫెస్టోలో మరిన్ని ఆయుధాలు బయటపెడతాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో అనడం ఏంటి?. బీఆర్ఎస్ ఏం చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. చేరికలు కంటిన్యూగా కొనసాగుతాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదు. అధికారం కోల్పోతామని కేటీఆర్, హరీష్ రావు (KTR, Harish Rao) భయపడి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు (Congress Candidates) రెడీ అయ్యాయి.. ఏఐసీసీ ఆమోదం తెలపగానే ప్రకటిస్తాం. కేసీఆర్ మానస పత్రికల్లో రోజూ నా వార్తలు వేస్తున్నారు. దాన్ని బట్టి నన్ను వాళ్ళు ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. 19% అన్ డిసైడెడ్ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి. అదంతా కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. రాష్ట్రంలో ఏ మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదు’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బీసీల కోసం..!
‘కాంగ్రెస్‌లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీ చీఫ్‌గా (PCC Chief) నేను కొట్లాడుతాను. సర్వే లో ఓసి, బీసీకి సమాన రిజల్ట్ వస్తే బీసీకే టిక్కెట్ ఇస్తాం. తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగడంలో తప్పులేదు. బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే మేం ఎక్కువ ఇస్తాం’ అని రేవంత్ రెడ్డి ఒకింత కీలక ప్రకటనే చేశారు. కాగా గత కొన్నిరోజులుగా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌పై రేవంత్ పై విధంగా స్పందించారు.
అప్పుడే అయిపోలేదు..!
మొత్తానికి చూస్తే.. ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీములు, వర్గాల వారిగా డిక్లరేషన్లు, మిని మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్.. త్వరలోనే మరో అదిరిపోయే మేనిఫెస్టోతో రాబోతోందని రేవంత్ మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే.. ఇప్పుడు జస్ట్ టీజర్ మాత్రమే వదిలాం.. ఇంకా అసలు సిసలైన సినిమా ముందున్నది అనే రేవంత్ చెప్పకనే చెప్పేశారన్న మాట. ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క అంటూ బీఆర్ఎస్‌కు అవాక్కయ్యేలా మేనిఫెస్టో, చేరికలు, టికెట్లు, సీట్ల గురించి రేవంత్ ప్రకటనలు చేయడంతో ఇప్పుడీ వ్యవహారంపైనే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీములతోనే లాక్కోలేక.. పీక్కోలేక.. తర్జన భర్జన పడుతున్న బీఆర్ఎస్.. ఎలాంటి పథకాలు ప్రకటిస్తుంది..? కాంగ్రెస్‌ను మించి ఏం ప్రకటన చేస్తుంది..? అనేదానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ మున్ముందు ఎలాంటి ప్రకటనలు ఉంటాయో చూడాలి మరి.